తణుకులో టీడీపీకి ఎడ్జ్..మంత్రికి కష్టమేనా?

గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పి చాలా తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు కూడా ఒకటి. కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఇక్కడ టి‌డి‌పి ఓటమి పాలైంది. అయితే ముందు నుంచి తణుకులో టి‌డి‌పికి కాస్త బలం ఉండేది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది..2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచింది.

అయితే 2019 ఎన్నికల్లో కూడా ఈ సీటులో టి‌డి‌పి గెలుస్తుందని అంచనా ఉంది. కానీ అనూహ్యంగా జనసేన ఇక్కడ 31 వేల ఓట్లు తెచ్చుకుని టి‌డి‌పి గెలుపుకు గండి కొట్టింది. దీంతో వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, టి‌డి‌పి నేత అరిమిల్లి రాధాకృష్ణాపై కేవలం 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా కారుమూరి పెద్దగా మంచి మార్కులే ఏమి తెచ్చుకోలేదనే టాక్ ఉంది. రెండోవిడతలో మంత్రి అయ్యాక నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృధ్ది పనులు చేయడంలో కూడా సక్సెస్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలనే ప్రచారం చేస్తున్నారు తప్ప…ఇక్కడ కొత్త అభివృద్ధి కార్యక్రమాలు లేవనే విమర్శలు వస్తున్నాయి.

దీంతో ఇటీవల సర్వేల్లో మంత్రి బాగా వెనుకపడ్డారని తెలుస్తోంది. అటు టి‌డి‌పి నేత అరిమిల్లి ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పైగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన తణుకులో అభివృద్ధి పనులు బాగానే చేశారని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి. ఇక ఇక్కడ జనసేన బలం అలాగే ఉంది. సింగిల్ గా ఆ పార్టీకి గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. ఇక్కడ కాస్త టి‌డి‌పికి ఎడ్జ్ కనిపిస్తోంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా తణుకు సీటు టి‌డి‌పి గెలుస్తుందని అంటున్నారు.