మాణిక్కం ప్లేస్‌లో మాణిక్..రేవంత్ సైడ్ అవుతారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, పదవుల పంపకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందని గళం విప్పారు.

దీంతో ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి..నేతల సమస్యలు తెలుసుకున్నారు. అయితే మెజారిటీ సీనియర్ నేతలు..రేవంత్, మాణిక్కంని తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక దిగ్విజయ్ ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి పరిస్తితులు వివరించారు. దీంతో అధిష్టానం ఊహించని విధంగా మాణిక్కంని తప్పించింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ను పార్టీ అధిష్ఠానం తప్పించింది. ఆ స్థానంలో మహారాష్ట్ర పీసీసీ మాజీ చీఫ్‌ మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. ఠాగూర్‌కు గోవా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది.

ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సైతం..పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు తానే అడ్డు అనుకుంటే.. తన పదవినే కాకుండా ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఉపయోగపడుతుందనుకుంటే తన పదవిలో ఏ నాయకుడిని కూర్చోబెట్టినా.. భుజంపై పల్లకిలా మోసే బాధ్యత తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

ఇదేదో తాను మాట వరుసకు చెబుతున్నది కాదని, గత 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఏ పార్టీ పక్కన నిలబడితే ఆ పార్టీ జెండా కోసమే పోరాడానని చెప్పారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సైతం టి‌పి‌సి‌సి పదవి నుంచి తప్పుకుంటారని ప్రచారం మొదలైంది. అందుకే రేవంత్ ముందుగానే త్యాగానికి రెడీ అని మాట్లాడారా? అని డౌట్ వస్తుంది. మరి చూడాలి కాంగ్రెస్ లో ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో.