తలలు నరికేయ్యడమే హీరోయిజమా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారీ హీరోలు..??

గతంలో హీరోలు హీరోయిజం చూపిస్తే దానిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడి వెళ్లేవారు కానీ ఇప్పుడా రోజులు పోయాయి. భీకరమైన యాక్షన్స్ సన్ని వేషాలు, తలలు నరికేసుకోవడాలు, కత్తులతో మారణ హోమం సృష్టించడాలు ఇప్పటి సినిమాల్లో పెడితే అవి ఎదురుతన్నడం తప్ప పాజిటివ్ రిజల్ట్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజుల్లో సినిమా కథలు బాగుంటే తప్ప ఎంత పెద్ద హీరో అయినా, అతడు ఎంత హీరోయిజం చూపించినా ఆ సినిమాలను ఎవరూ ఆదరించరు. ఈ విషయం మరిచి టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ సంక్రాంతికి అర్థం పర్థం లేని సినిమాలను ప్రేక్షకులపై రుద్దేశారు.

మొదటగా బాలయ్య మూవీ ‘వీర సింహా రెడ్డి’ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమా అంతటా బాలకృష్ణ రౌడీలను కత్తులతో నరకడమే కనిపిస్తుంది. ఈ హింస చూడడానికి ప్రేక్షకులు వెళ్తారా అనేది ప్రశ్నార్థకమే. అది చాలదన్నట్టు ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేషన్‌లో బాలకృష్ణ విలన్ దునియా విజయ్ తల నరికేస్తాడు. అలా సినిమా మొదలు చివరి వరకు తలలు నరికేయడమే కనిపిస్తుంది. పండుగ సందర్భంగా సినిమా చూసి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారు ఈ పాతకాలం ఫార్ములా తో వచ్చేసిన యాక్షన్ సినిమా చూస్తారని బాలయ్య, దర్శకుడు గోపీచంద్ అనుకోవడం నిజంగా అవివేకమే.

ఇక ‘వాల్తేరు వీరయ్య’లో కూడా నరుకుడు సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలు కేవలం వీరాభిమానులకు తప్ప మిగతా వారికి రుచిస్తాయా? గతంలో వినయ విధేయ రామ ఇదే ఫార్ములాతో వచ్చి ఎలా అట్టర్ ఫ్లాప్ అయిందో ఆల్రెడీ చూశాం. అయినా కూడా కేవలం ఇలాంటి యాక్షన్స్ సన్నివేశాలే నమ్ముకుని ఇద్దరు సీనియర్ హీరోలూ సంక్రాంతి బరువులోకి దిగడం నిజంగా తెలుగు ప్రేక్షకుల దురదృష్టమే అని చెప్పాలి. పెద్దగా బడ్జెట్ పెట్టకపోయినా కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకొచ్చే బాధ్యత సీనియర్ హీరోల మీద కచ్చితంగా ఉంది కానీ సంక్రాంతి సందర్భంగా ఏదో ఒకటి రిలీజ్ చేస్తే హిట్ అవుతుంది కదా అనుకుంటే అది ఏమాత్రం సమంజసం కాదని సినీ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.