కోటంరెడ్డిని కలిశారు..మరి ఆనంని వదిలేసినట్లేనా?

ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలని సైతం తప్పుబట్టే పరిస్తితి ఉంది. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, గుంతలు పూడ్చలేదని, ఇళ్ళు కట్టలేదని..ఇంకా ప్రజలని ఓట్లు ఎలా అడుగుతామని ఆనం ప్రశ్నించారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారా అని నిలదీశారు.

ఆయన గతంలో కూడా పలుమార్లు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం..అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని పరిమితులు పెంచి..కొన్ని పెన్షన్లని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3 వేల పెన్షన్లని తొలగించడంపై అధికారులపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. ఇంకా గడపగడపకు ఏ మొహం పెట్టుకుని వెళ్తామని ఫైర్ అయ్యారు.

ఇలా ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు..ఇదే సమయంలో తాజాగా జగన్..కోటంరెడ్డిని కలవాలని పిలిచారు. ఈ క్రమంలోనే జగన్‌ని కోటంరెడ్డి కలిసి తన సమస్యలు చెప్పారు. ఇంకా నియోజకవర్గంలోని సమస్యల గురించి వివరించినట్లు తెలిసింది. అయితే బహిరంగంగా విమర్శలకు దిగవద్దని, ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలతో చర్చించాలని జగన్…కోటంరెడ్డికి సూచించినట్లు తెలిసింది.

అయితే కోటంరెడ్డిని పిలిచిన జగన్..ఆనంని పిలవకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఆనంకు పొమ్మనలేక పొగబెడుతున్నారని తెలుస్తోంది. అటు ఆనం సైతం సీటు దొరకపోతే వైసీపీని వీడతారనే ప్రచారం ఉంది. చూడాలి మరి ఆనం రాజకీయం ఎలా ఉంటుందో.