ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసిన పాన్ ఇండియా తెలుగు హీరోలు!

సినిమా జీవితం అంటేనే ఒక మాయ. అందులోనూ సినిమా హీరోల జీవితాలు అంటే ఇంకా మాయ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడినవాడు హీరో. ప్లాప్ సినిమా పడినవాడు జీరో అయిపోతాడు. ఇక హిట్టైన హీరోల సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ పడితే ఇంకేమైనా వుంటుందా? రెమ్యూనరేషన్ తారాస్థాయికి చేరిపోతుంది. ఇక హీరోకి పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ ఉందని తెలిసిన తర్వాత ప్రొడ్యూసర్లు కూడా అదే స్థాయిలో వారికి ముట్టజెపుతారు.

అలా ఈ ఏడాది ఆ రేంజ్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరోలుగా అడవి శేష్, నిఖిల్ సిద్ధార్థ్ ని చెప్పుకోవచ్చు. అవును, అడవి శేష్ ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటించగా రెండూ హిట్‌గా నిలవడంతో అతను ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. మరోవైపు ఓవర్సీలో కూడా కలెక్షన్ల పరంగా దుమ్ముదులపడంతో మనోడు మంచి ఖుషిగా వున్నాడు. కాగా ప్రస్తుతం అడవి శేష్ ‘గూడాచారి-2’ మూవీని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. నిన్నమొన్నటివరకు కోటి రెండు కోట్లు తీసుకున్న మనోడు నేడు 8 కోట్లవరకు డిమాండ్ చేసినట్టు భోగట్టా.

ఇక నిఖిల్ సిద్ధార్థ్ కూడా అందరికీ తెలిసిందే. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోవడంతో మనోడికి నార్త్ లో మంచి క్రేజ్ వచ్చింది. చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కించిన తీరుకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఈ మూవీ బడ్జెట్ రూ.15 కోట్లు‌కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ.118 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దాంతో నిఖిల్ సిద్ధార్థ తన రెమ్యూనరేషన్‌ని రూ.7 కోట్లకి పెంచేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.