సత్తెనపల్లిలో మారిన లెక్క..అంబటికి పవన్ చెక్..!

వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్.. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేసినా, బీజేపీతో పొత్తు వల్ల పవన్..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు..కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని గద్దె దించడం కుదురుతుంది. అయితే ఆ దిశగానే పవన్ ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన వల్ల ఓట్లు చీలిపోవడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్..తాజాగా సత్తెనపల్లి కౌలు రైతుల సభలో చెప్పారు.

కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వను అని, వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా చూసుకుంటానని, వైసీపీని ఓడిస్తామని చెబుతున్నారు. అయితే ఓట్లు చీలకుండా ఉండాలంటే ఖచ్చితంగా పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే..లేదంటే మళ్ళీ ఓట్లు చీలిపోయి వైసీపీకి అనుకూలంగా మారుతుంది. అందుకే ఈ సారి టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికే పవన్ ఆసక్తిగా ఉన్నారు. ఇక బీజేపీని ఒప్పించి టీడీపీతో కలుస్తారో లేక బీజేపీని వదిలేసి టీడీపీతో కలుస్తారో చూడాలి.

Pawan Kalyan: వైసీపీకి ఓటమే

అయితే పొత్తు ఉంటే పవన్ టార్గెట్ కొందరు వైసీపీ కీలక నేతలు ఉంటారు. అందులో అంబటి రాంబాబు ముందు ఉంటారు. ఇక ఆయన ఏ విధంగా పవన్‌ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయన్ని పవన్ గట్టిగా టార్గెట్ చేశారు. తాజాగా సత్తెనపల్లి సభలో అంబటిపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఆత్మహత్య చేసుకున్న కౌలు రౌతులకు రావలసిన బీమా సొమ్ము రూ.7 లక్షల్లో తనకు రూ.2.50 లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు బాధిత కుటుంబ సభ్యులకు చెబుతున్నారని, ఇంత కంటే నీచం ఉంటుందా? శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అంబటికే ఉందని ఫైర్ అయ్యారు.  ఇక వచ్చే ఎన్నికల్లో అంబటిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సత్తెనపల్లిలో జనసేనకు కొంత ఓటు బ్యాంక్ ఉంది..అది గాని టీడీపీకి కలిస్తే అంబటికి చెక్ పడే ఛాన్స్ ఉంది. మరి చూడాలి అంబటి పరిస్తితి ఏం అవుతుందో.