పాత సినిమాల‌తో పోటీ ప‌డుతున్న ప‌వ‌న్-మ‌హేష్‌.. గెలిచేది ఎవ‌రో?

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్క‌డు` ఒక‌టి. ఇందులో భూమిక హీరోయిన్ గా న‌టించింది.

గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా ఎం.ఎస్.రాజుకు మంచి లాభాలను అందించింది. అయితే జనవరి నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని అంటున్నారు. అలాగే మ‌రోవైపు ప‌వ‌న్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `ఖుషి` కూడా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోనూ భూమిక‌నే హీరోయిన్‌గా న‌టించింది. 2001లో విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాదు ప‌వ‌న్ ఇమేజ్ ను డ‌బుల్ చేసింది. అయితే ఈ సినిమాను డిసెంబ‌ర్ 31 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఖుషి రిలీజైన వారం త‌ర్వాత మ‌హేష్‌బాబు ఒక్క‌డు సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి రానుంది. మ‌రి ఈ రెండు చిత్రాలు రీ రిలీజ్ లో ఎలా వ‌సూళ్ల‌ను రాబ‌డ‌తాయి.. పాత సినిమాల‌తో పోటీ ప‌డుతున్న మ‌హేష్‌, ప‌వ‌న్ ల‌లో గెలిచేది ఎవ‌రు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.