ఆ టైమ్‌లో చాలా బాధ‌ప‌డ్డా.. నాక‌ది రాసిపెట్టి లేదు: అనుప‌మ

ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకోవడంపై కూడా అనుపమ‌ స్పందించింది. `సుకుమార్ గారు తెర‌కెక్కించిన‌ రంగస్థలం సినిమా మిస్ అయిన టైంలో చాలా బాధపడ్డాను. ఆ సినిమా నాకు రాసి పెట్టలేదు.

అయితే ఏ సినిమా కథను అయినా మనం ఎంచుకోము. ఆ క‌థే మనల్ని ఎంచుకుంటుంది. రంగస్థలం మిస్ అయినా ఇప్పుడు సుకుమార్ గారు రాసిన 18 పేజెస్ కథలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ నా మనసుకు ఎంతగానో దగ్గర అయింది. ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంద‌ని భావిస్తున్నాను` అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో అనుపమ మరో హిట్ ను ఖాతాలో వేసుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి.