టీడీపీలో కన్ఫ్యూజన్: సీట్లు ఇప్పించినవారికే ‘సీటు’ కష్టాలు..!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిస్తితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు..ఈ సారి సీట్ల కేటాయింపుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగే సీనియర్లు రికమండ్ చేశారని చెప్పి ఇతర నేతలకు సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతి నియోజకవర్గం గురించి తనవద్ద పూర్తి సమాచారం పెట్టుకుని బాబు సీట్లు కేటాయించాలని చూస్తున్నారు.

ఇదే క్రమంలో ఇంతకాలం రికమండ్ చేసి ఇతర నేతలకు సీట్లు ఇప్పించిన సీనియర్లకే ఇప్పుడు సీటు దక్కుతుందో లేదో తెలియని పరిస్తితి ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ సీనియర్ల పరిస్తితి అయోమయంలో పడింది. జిల్లాలో యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప సీనియర్ నేతలు. అలాగే బాబుకు సన్నిహితులు కూడా. గతంలో వీరు చేతుల మీదుగా కొందరికి సీట్లు దక్కిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు కదా..ఇప్పుడు వారికే సీట్లు దక్కుతాయా? లేదా? అనేది తెలియకుండా ఉంది.

తుని సీటు యనమల ఫ్యామిలీదే. గత రెండు ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా సీటు ఇస్తే ఓడిపోతారని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు. దీంతో ఈ సారి తుని సీటుని శెట్టిబలిజ లేదా కాపు వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని బాబు చూస్తున్నారని తెలుస్తోంది. అటు రాజప్పకు ఈ సారి పెద్దాపురం సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది. ఆ సీటు కమ్మ వర్గానికి ఇవ్వాలని డిమాండ్ వస్తుంది. ఇక రాజప్పని రాజానగరం పంపుతారనే టాక్ వస్తుంది.

ఇటు జగ్గంపేట సీటు జ్యోతుల ఫ్యామిలీదే..కానీ జ్యోతుల తనయుడు నవీన్ కాకినాడ ఎంపీ సీటు అడుగుతున్నారు. ఆ సీటు ఇవ్వడానికి బాబు రెడీగా లేనట్లు ఉన్నారు. మొత్తానికి ముగ్గురు సీనియర్లకు సీటు కష్టాలు ఉన్నాయి.