పాదయాత్రతో లోకేష్..మంగళగిరిలో వైసీపీ ఆపరేషన్..!

టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్ లతో వన్ టూ వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బాదుడేబాదుడు..ఇదేం ఖర్మ అంటూ కార్యక్రమాలతో నేతలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటు బాబు సైతం రోడ్ షోలతో జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు.

ఇదే క్రమంలో వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా పార్టీకి మరింత బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. దాదాపు అన్నీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర జరగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం వరకు పాదయాత్ర జరుగుతుంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన సన్నాహాలు పూర్తి అయ్యాయి. అలాగే పార్టీలోని యువ నేతలు..పాదయాత్ర పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్నారు.

ఇప్పటికే లోకేష్ పాదయాత్ర గురించి ప్రకటన చేశారు..జనవరి 27 నుంచి పాదయాత్ర ఉంటుందని మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. అయితే తాను పాదయాత్రలో ఉంటాను కాబట్టి..మంగళగిరిలో జగన్ టీమ్ మనల్ని దెబ్బతీయడానికి వ్యూహాలు వేస్తుందని, వాటికి ధీటుగా నిలబడి కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. దాదాపు ఏడాదిపైనే జరగనున్న ఈ పాదయాత్ర..కేవలం 4 రోజుల పాటు మంగళగిరిలో పాదయాత్ర జరుగుతుందని తెలిసింది.

అంటే మిగిలిన రోజులు..మంగళగిరి ప్రజలకు లోకేష్ అందుబాటులో ఉండరు. ఈ క్రమంలో అక్కడ రాజకీయాలని వైసీపీ మార్చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే గంజి చిరంజీవులు లాంటి నాయకుడుని లాగేసుకున్నారు. తాజాగా దుగ్గిరాల మండలానికి చెందిన కొందరు కార్యకర్తలని వైసీపీలో చేర్చుకున్నారు. మరి లోకేష్ పాదయాత్రకు వెళితే..మంగళగిరిలో టీడీపీని వీక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లోకేష్ లేకపోయినా కార్యకర్తలు ఏ మేర నిలబడతారో చూడాలి.