రోజాకు ‘వైసీపీ’ చెక్..నగరిలో డౌటే..!

ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా..ప్రతిపక్ష పార్టీలపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో చెప్పాల్సిన పని లేదు..చంద్రబాబు, పవన, లోకేష్‌లపై వ్యక్తిగత విమర్శల దాడికి దిగుతారు. ఇలా ప్రతిపక్ష నేతలని తిట్టడంలో ఆరితేరి ఉన్నందునే రోజాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పొచ్చు. మంత్రి పదవి వచ్చాక కూడా తన శాఖకు సంబంధించి రోజా ఏం చేస్తున్నారో జనాలకు క్లారిటీ లేదు గాని..చంద్రబాబు, పవన్‌లని మాత్రం తిడుతున్నారనే క్లారిటీ బాగా ఉంది.

ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనలు కూడా అందరికీ తెలిసిందే. ఇలా ప్రతిపక్షాలపై విరుచుకుపడే రోజాకు సొంత పార్టీతోనే పెద్ద తలనొప్పి ఎదురవుతుంది. 2019 ఎన్నికల్లో ఆమె మళ్ళీ నగరి నుంచి గెలిచిన దగ్గర నుంచి..అక్కడ రోజాకు వ్యతిరేక వర్గం పెరిగింది. రోజా కొందరు నేతలని పట్టించుకోకపోవడంతో..వారు రోజాకు వ్యతిరేక వర్గంగా ఏర్పడి రాజకీయం చేస్తున్నారు. నగరికి చెందిన శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కేజే శాంతి…ఇంకా ఇతర నేతలు..నగరిలో రోజాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు రోజా..వైసీపీ  అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే వ్యతిరేక వర్గం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ మధ్య స్థానిక ఎన్నికల్లో కూడా వ్యతిరేక వర్గం..తమ అభ్యర్ధులని నిలబెట్టి సక్సెస్ అయింది. అప్పుడు కూడా రచ్చ జరిగింది. ఇక తాజాగా నగరిలోని కొప్పేడు గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజా జరిగింది. అసలు మంత్రి రోజాతో సంబంధం లేకుండా చక్రపాణిరెడ్డి, కే‌జే శాంతి..ఈ కార్యక్రమాన్ని చేశారు.

దీంతో రోజా బాగా హర్ట్ అయ్యి..నగరి కార్యకర్తలకు వాయిస్ మెసేజ్ పంపారు. టీడీపీ, జనసేన పార్టీల వాళ్లు నవ్వుకునేలా తనను బలహీనపరుస్తున్నారని, ఇలాంటి వారు పార్టీలో కొనసాగితే రాజకీయాలు చేయడం చాలా కష్టమని మాట్లాడారు. అంటే నగరిలో రోజా పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మామూలుగానే నగరిలో రోజాపై వ్యతిరేకత కనిపిస్తోంది..అటు టీడీపీ బలపడుతుంది..తమ అధినేతలని తిడుతున్న రోజానీ ఓడించాలని టీడీపీ-జనసేన శ్రేణులు కసి మీద ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సొంత పార్టీలో వ్యతిరేక వర్గం రోజాకు చుక్కలు చూపిస్తుంది. ఈ పరిణామాలు బట్టి చూస్తే నగరిలో రోజాకు గెలుపు డౌట్ అనే పరిస్తితి వచ్చేసింది. టీడీపీ-జనసేన కాదు..సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు.