టీడీపీ-జనసేన: తూర్పులో వైసీపీకి నాలుగే..!

చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త గుబులు మొదలైంది..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం మొదలైంది. దీంతో పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..కానీ ఈ సారి కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్.

ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన ఉమ్మడి తూర్పు గోదావరిలో వైసీపీకి చిక్కులు తప్పవు. తూర్పులో అత్యధికంగా 19 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 4, జనసేన 1 గెలుచుకుంది. టీడీపీ-జనసేన మధ్య ఓట్లు చీలడం వల్లే వైసీపీ 14 సీట్లు గెలుచుకోగలిగింది. కానీ ఈ సారి పొత్తు ఖాయమవుతుంది. కాబట్టి తూర్పులో వైసీపీకి పెద్ద రిస్క్ తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి.

పొత్తు ప్రభావం తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువ కనిపిస్తోంది. పొత్తు ఉంటే..అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, ప్రత్తిపాడు, రామచంద్రాపురం, మండపేట, రాజమండ్రి రూరల్, సిటీ, కాకినాడ సిటీ, రూరల్, రాజోలు, పెద్దాపురం, పిఠాపురం, కొత్తపేట సీట్లలో పొత్తు ప్రభావం క్లియర్‌గా ఉంటుంది. 14 సీట్లలో పొత్తు ఎఫెక్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ 14లో టీడీపీ రాజమండ్రి సిటీ, రూరల్, మండపేట, పెద్దాపురం సీట్లు, జనసేన రాజోలు సీటు గెలుచుకుంది..మిగిలినవి వైసీపీ గెలుచుకుంది. అయితే టీడీపీ-జనసేన మధ్య ఓట్లు చీలడం వల్లే ఆ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి.

ఇక రాజానగరం సీటులో కాస్త జనసేన ప్రభావం ఉంది. కానీ గత ఎన్నికల్లో జనసేనకు 20 వేల ఓట్లు వస్తే…27 వేల మెజారిటీతో టీడీపీపై వైసీపీ గెలిచింది. ఇవి తీసేయగా జగ్గంపేట, తుని, రంపచోడవరం, అనపర్తి సీట్లలో పొత్తు ప్రభావం ఉండదు..పొత్తు ఉంటే ఈ నాలుగు సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. పొత్తు లేకపోతే మెజారిటీ సీట్లు మళ్ళీ వైసీపీకే దక్కుతాయి.