యనమల ఫ్యామిలీ కష్టాలు..కథ ముగిసినట్లేనా!

దశాబ్దాల తరబడి టీడీపీలో పనిచేస్తూ.. ఆ పార్టీలో టాప్ లీడర్‌గా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయన ఫ్యామిలీ సీటు దక్కేలా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలని సైతం ఉపయోగించుకోవడంలో యనమల ఫ్యామిలీ ఫెయిల్ అయింది..ఈ క్రమంలో ఈ సారి అవకాశమే దక్కేలా లేదు.

1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు తుని నుంచి యనమల గెలిచారు..2009లో ఓడిపోయారు. 2014లో పోటీ నుంచి  తప్పుకుని తన తమ్ముడు కృష్ణుడుకు సీటు ఇప్పించుకున్నారు. అయినా సరే గెలవలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో యనమలకు ఎమ్మెల్సీ, ఆర్ధిక మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఎమ్మెల్సీ పదవి ఉంది గాని..ఆ ఫ్యామిలీకి ప్రజల ఇచ్చే పదవి దక్కడం లేదు. 2019లో కూడా కృష్ణుడు మరొకసారి ఓడిపోయారు.

ఇక వరుసగా కృష్ణుడుపై గెలిచిన దాడిశెట్టి రాజా ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూ..దూసుకెళుతున్నారు. తునిలో తన బలం ఇంకా పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా రాజాకు తిరుగులేదనే పరిస్తితి. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా తునిలో మళ్ళీ టీడీపీకి గెలుపు అవకాశాలు లేవని తేలింది. ఈ క్రమంలో ఈ సారి తుని సీటు యనమల ఫ్యామిలీకి ఇవ్వకూడదని నారా లోకేష్ భావిస్తున్నారట. కొద్దో గొప్పో చంద్రబాబు, యనమల ఫ్యామిలీ పట్ల సానుకూలంగా ఉన్నారు..కానీ వరుసగా మూడుసార్లు ఓడిపోవడం, మళ్ళీ గెలుపు అవకాశాలు లేకపోవడంతో యనమల ఫ్యామిలీ సీటు ఇవ్వడం అనవసరం అని లోకేష్ భావిస్తున్నారట.

అయితే తుని కాకుండా ప్రత్తిపాడు సీటు కృష్ణుడు ఆశిస్తున్నట్లు తెలిసింది. పోనీ తన తమ్ముడుకు కాకపోయినా, తన కుమార్తె దివ్యకు కాకినాడ రూరల్ సీటు ఇప్పించుకోవాలని యనమల  ట్రై చేస్తున్నారట. దానికి కూడా చినబాబు ఒప్పుకోవడం లేదట. ఎలాగో యనమలకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు..కాబట్టి ఇక ఫ్యామిలీకి సీట్ ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదని అంటున్నారు. ఒకవేళ నెక్స్ట్ సీటు దక్కకపోతే యనమల ఫ్యామిలీ కథ ముగిసినట్లే. మరి సీటు కోసం యనమల ఎలా ట్రై చేస్తారో చూడాలి.