సాయిరెడ్డి చానల్..కాన్ఫిడెన్స్ లేదే..?

ఎప్పుడు సొంత కథనాలు ఇవ్వని ఈనాడు సంస్థ సైతం ఈ మధ్య..తమదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడుతుంది. పదే పదే వైసీపీ నేతలు..ఈనాడు, రామోజీరావులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనాడు సైతం తమ పంథాని మార్చుకుంది. ఇప్పటివరకు నాయకులు మాట్లాడిన మాటలని మాత్రమే తమ పత్రికలో గాని, మీడియాలో గాని వేసేది.

ఇప్పుడు మాత్రం సొంత కథనాలు ఇస్తూ వస్తుంది..ఇప్పటికే రాజధాని అంశంలో వైసీపీ వైఫల్యాలని ఎండగట్టింది. అలాగే పోలవరం విషయంలో వైసీపీ తప్పిదాలని బయటపెట్టింది. ఇక తాజాగా విశాఖ పరిపాలన రాజధాని కోసం వైసీపీ పోరాటం మొదలుపెట్టింది. అలాగే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియాపై వైసీపీ తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనాడు సంస్థ..ఉత్తరాంధ్రకు వైసీపీ చేసింది ఏమి లేదనే కోణంలో కథనాలు ఇచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాగా జరిగిందని..వైసీపీ మాత్రం అభివృద్ధి కోసం పెద్దగా ఖర్చు పెట్టలేదని చెప్పుకొచ్చింది.

అలాగే విశాఖలో వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి కథనం ఇచ్చింది..ఆ మధ్య విజయసాయి విశాఖలో తనకు ఒక ఇల్లు తప్ప..సెంటు భూమి లేదని, తన బంధువులకు కూడా లేదని చెప్పుకొచ్చారు. దీనిపై కౌంటర్ ఇస్తూ..విజయసాయి భూ అక్రమాలకు పాల్పడ్డారని పలు ఆధారాలని ఈనాడు చూపించింది.

దీనిపై విజయసాయి కౌంటర్ ఇవ్వడంలో కాస్త తడబడ్డారు. తన కుమార్తెకు వ్యాపారాలు, భూములు ఉంటే తనవి ఎందుకు అవుతాయని మాట్లాడారు. ఇక అసలు విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వకుండా..ఈనాడుకు ధీటుగా చానల్ పెడతానని, అవసరమైతే పేపర్ పెడతానని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా వస్తామని మాట్లాడారు. సాయిరెడ్డి మాటలు పూర్తిగా ఆత్మరక్షణ కోసం మాట్లాడినట్లే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి విజయసాయి చానల్ ఎప్పుడు పెడతారో చూడాలి.