మేకపాటికి డౌటే..బొల్లినేనికి నో ఛాన్స్..!

ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో చాలా వింత పరిస్తితులు ఉన్నాయి..ఇప్పటికే పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్‌గా అది టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ ఉంటుంది..అలా అని టీడీపీకి పాజిటివ్ ఉండటం లేదు.

ఇలాంటి పరిస్తితి ఉన్న నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మూడేళ్ళ పాటు ఎమ్మెల్యే పనితీరు గమనిస్తే..అక్కడ ఆయనకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఆయన పనితీరు పట్ల సొంత పార్టీ వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అవినీతి, అక్రమాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

అయితే మేకపాటికి ఇక్కడ అతి పెద్ద మైనస్ పాయింట్ ఒకటి ఉందని..దాని గురించి ఓపెన్‌గా చెప్పడానికి కుదరకపోయినా..అక్కడ నియోజకవర్గ ప్రజలకు మాత్రం బాగా తెలుసని అంటున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో 150 గ్రామాల వరకు ఉంటే దాదాపు 130 గ్రామాల్లో మేకపాటికి నెగిటివ్ ఉందని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్తితులు ఉన్నప్పుడు టీడీపీ బలపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకుని బలపడటంతో టీడీపీ నేత బొల్లినేని రామారావు విఫలమవుతున్నారని తెలుస్తోంది.

దూకుడుగా పనిచేయకపోవడం, ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరగకపోవడం, ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం లాంటి అంశాలు బొల్లినేనికి మైనస్ అవుతున్నాయి. ఉదయగిరిలో వైసీపీకి ధీటుగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయినా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో బొల్లినేని ఉన్నారు. దీని వల్ల కొద్దో గొప్పో ఇప్పటికే వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ఇకనైనా బొల్లినేని తీరు మారితే ఉదయగిరిలో టీడీపీ గెలవడానికి ఛాన్స్ వస్తుంది..లేదంటే అంతే సంగతులు.