కృష్ణాలో ‘మంత్రి’ సెంటిమెంట్..కొడాలి బ్రేక్ చేస్తారా?

రాజకీయాల్లో రాజకీయం చేయడం, కష్టపడి పనిచేసి గెలవడం లాంటివి మామూలే. అదే సమయంలో రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్‌లు కూడా ఉంటాయి. అవి కూడా గెలుపోటములపై ప్రభావం ఉంటాయి. అలా అని కష్టాన్ని తక్కువ చేయడం కాదు. కానీ సెంటిమెంట్‌లతో కూడా కొన్ని గెలుపోటములు ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు కొన్ని స్థానాల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది.

ఏలూరు, ఒంగోలు లాంటి అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. అది ఈ సెంటిమెంట్ నమ్మాలని కాదు గాని..ఇప్పటివరకు అదే నిజమవుతూ వచ్చింది. అలాగే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గెలిస్తే..రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులుగా పనిచేసినవారు..మళ్ళీ ఎన్నికల్లో గెలవడం జరగదు అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది.

 

గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసినవారు. మళ్ళీ ఎన్నికల్లో గెలవలేదు. ఉదాహరణకు 2014లో టీడీపీ హయాంలో దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర మంత్రులుగా పనిచేశారు. వీరు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అసలు వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఉమా..మంత్రిగా చేసి అనూహ్యంగా ఓడిపోయారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఇప్పుడు వైసీపీ మంత్రులని భయపెడుతుంది. మొదట మంత్రులుగా చేసిన కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లతో పాటు ఇప్పుడు మంత్రిగా చేస్తున్న జోగి రమేష్‌కు ‘మంత్రి’ సెంటిమెంట్ టెన్షన్ పెంచుతుంది.

అయితే వీరిలో పేర్ని నాని..నెక్స్ట్ తాను పోటీ చేయనని తన వారసుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. ఆ సెంటిమెంట్‌కు భయపడే వారసుడుని రంగంలోకి దించుతున్నారనే టాక్ ఉంది. అయినా సరే బందరులో పేర్నికి రిస్క్ ఉంది. జోగి, వెల్లంపల్లి పరిస్తితి కూడా అంతే. నెక్స్ట్ ఎన్నికల్లో వారికి కాస్త గెలుపు కష్టమయ్యేలా ఉంది. పైగా టీడీపీ-జనసేన కలిస్తే ఈ ముగ్గురు గెలుపు దాదాపు గగనమే. కానీ వీరిలో కొడాలికి రిస్క్ తక్కువ. గుడివాడలో ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పొత్తు ఉన్నా సరే కొడాలిపై ప్రభావం ఉండదు. మరి మంత్రులు ఓడిపోతారనే సెంటిమెంట్‌ని కొడాలి నెక్స్ట్ బ్రేక్ చేస్తారేమో చూడాలి.