కమలంలో ‘కన్నా’ కథ..జంపింగ్ రెడీనా..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలవడం..వైసీపీని ఎంత టెన్షన్ పెట్టిందో తెలియదు గాని..బీజేపీని మాత్రం బాగా టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు. పొత్తులో ఉండి కూడా పవన్‌ని సరిగ్గా యూజ్ చేసుకుని బలపడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. పైగా కలిసి పనిచేద్దామని పవన్..బీజేపీని రూట్ మ్యాప్ అడిగినా సరే..పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇటీవల పవన్.. బీజేపీపై, మోదీపై గౌరవం ఉందంటూనే.. ఊడిగం చేయనని.. రోడ్డు మ్యాప్‌ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుందని.. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే ప్రజల్ని రక్షించుకోవడానికి వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు.

ఇలా చెప్పిన తర్వాత బాబు వెళ్ళి పవన్‌తో భేటీ అయ్యి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. దీంతో పవన్..బీజేపీని వదిలేసి..టీడీపీతో కలుస్తారని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ..సోము వీర్రాజు లక్ష్యంగా విమర్శలు చేశారు. మాస్  ఫాలోయింగ్ ఉన్న పవన్‌ని వాడుకోవడంలో విఫలమయ్యారని, పార్టీలోని అన్ని విషయాలు సోము వీర్రాజు చూసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఏపీ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోవాలని కన్నా కోరారు. అలాగే సోముని బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తన అనుచరులతో కన్నా భేటీ అవ్వడానికి రెడీ అయ్యారు. ఇక బీజేపీలో ఉండే విషయంపై చర్చించుకునే అవకాశం ఉంది. కానీ ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో క్లారిటీ లేదు. గతంలో వైసీపీలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యి..చివరికి బీజేపీ పెద్దలు జగన్‌కు కన్నాని చేర్చుకోవద్దని, తమ పార్టీలో చేరుతారని చెప్పడంతో జగన్ ఆగిపోయారు. అటు కన్నా కూడా బీజేపీలోకి వచ్చారు.

అయితే ఇప్పుడు కన్నా టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ బీజేపీని కాదని టీడీపీ లేదా జనసేన కన్నాని చేర్చుకునే ధైర్యం చేస్తాయా? అనేది డౌట్. అటు వైసీపీ పరిస్తితి కూడా అంతే. బీజేపీకి వ్యతిరేకంగా ఏది చేయాలన్న టీడీపీ-వైసీపీ-జనసేనలకు ఇబ్బందే.