టీడీపీ కోసం జగ్గారెడ్డి కష్టం..ఇదెక్కడి రచ్చ..!

ఏపీలో అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది..బలమైన జగన్‌కు చెక్ పెట్టి..ఈ సారి అధికార పీఠంలో కూర్చోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా బాబు..పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అంశం వచ్చిన టీడీపీ వాడేసుకుంటుంది. ఆఖరికి పక్కనే ఉన్న తెలంగాణలోని కొందరు నేతలు…జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే..వాటిని కూడా తెగ ప్రచారం చేసేస్తున్నారు.

ఈ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని తెలంగాణలో రాజకీయం చేస్తున్న జగన్ సోదరి షర్మిల మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక షర్మిల వ్యాఖ్యలని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. ఇదిలా ఉండగానే తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాటలు టీడీపీకి పెద్ద ప్లస్ అవుతున్నాయి. ఇటీవల షర్మిల-జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

అయితే షర్మిలపై విమర్శలు చేస్తూనే..జగ్గారెడ్డి, జగన్‌ని మధ్యలోకి ఆయనపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక షర్మిలపై విమర్శలు వదిలేసి..జగన్‌పై జగ్గారెడ్డి మాట్లాడిన మాటలని టీడీపీ వైరల్ చేస్తుంది. వైఎస్సార్ చనిపోయినప్పుడు..ఆయన కుటుంబసభ్యులు ఎవరు ఏడవలేదని, అంతా రాజకీయంపైనే ఉన్నారని జగ్గారెడ్డి పాత విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే షర్మిల, జగన్‌లు బీజేపీ డైరక్షన్‌లోనే పనిచేస్తున్నారని, తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్ల కోసం బీజేపీ…జగన్, షర్మిలని వాడుకుంటున్నారని అన్నారు.

అలాగే ఏపీకి సంబంధించి..జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని, మూడు రాజధానుల వల్ల ఉపయోగం లేదని..అసలు రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసి జగన్-షర్మిల-విజయసాయిరెడ్డిలు సీఎంలుగా చేసుకోవాలని సెటైర్ వేశారు. ఇలా జగన్‌పై జగ్గారెడ్డి చేసిన విమర్శలని టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్ చేస్తుంది. ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు పెట్టేసి..జగన్‌పై ఇంకా విమర్శలు చేయిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ కోసం జగ్గారెడ్డి కష్టపడుతున్నట్లు అనిపిస్తోంది.