మాగంటి దూకుడు..సీటు కన్ఫామ్ ?

చాలారోజుల తర్వాత టీడీపీలో మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మాగంటి కాస్త రాజకీయంగా యాక్టివ్ గా లేకుండా పోయారు. పైగా కుమారుల మరణంతో మాగంటి కాస్త క్రుంగిపోయారు..దీంతో ఆయన రాజకీయాల వైపు రాలేదు. ఈ క్రమంలో ఏలూరు పార్లమెంట్ సీటు విషయంలో చాలా పెద్ద చర్చలు నడిచాయి. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటులో కొత్త అభ్యర్ధిని పెట్టొచ్చని ప్రచారం జరిగింది. అలాగే మాజీ ఎంపీ బోళ్ళ బుల్లి రామయ్య మనవడు రాజీవ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

అయితే చంద్రబాబు అధికారికంగా మాత్రం ఏలూరు పార్లమెంట్ సీటుని ఎవరికి ఫిక్స్ చేయలేదు. ఏలూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుగా మాత్రం గన్ని వీరాంజనేయులు పనిచేస్తున్నారు. ఆయనకు ఎలాగో ఉంగుటూరు సీటు ఉంది. దీంతో ఏలూరు ఎంపీ సీటు విషయంలోనే డౌట్ ఉంది. ఈ తరుణంలోనే మాగంటి బాబు అనూహ్యంగా యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అవ్వడమే కాదు..దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న మాగంటి..ఇటీవల అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడకు వచ్చినప్పుడు..కవ్వించిన కొడాలి నాని అనుచరులకు చెప్పు చూపించి ఒక్కసారిగా రాజకీయంగా హీట్ పుట్టించారు. రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో కొందరు కొడాలి అనుచరులు..కవ్వింపు చర్యలు చేశారు. దీంతో మాగంటి ఒక్కసారిగా వారికి చెప్పు చూపించారు.

అక్కడ నుంచి మాగంటి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు..ప్రస్తుతం ఏలూరులో పాదయాత్ర జరుగుతుంది..అక్కడ అన్నీ మాగంటి దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఇలా ఒక్కసారి యాక్టివ్ అయ్యి..తాను మళ్ళీ పోటీకి రెడీ అని మాగంటి..టీడీపీ అధిష్టానానికి హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగానే బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి మాగంటి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.