ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ జగన్ వైపేనా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీని, టీడీపీని వేరు వేరుగా చూడలేం. దివంగత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ…చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళినా సరే…టీడీపీపై నందమూరి ముద్ర ఉంటుంది…అలాగే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ గత కొనేళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కావాలనే చంద్రబాబు…ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని ప్రచారం ఉంది. లోకేష్ కోసం ఎన్టీఆర్‌ని మళ్ళీ రాజకీయాల వైపుకు రానివ్వలేదనే టాక్ ఉంది.

సరే టాక్ ఎలా ఉన్నా సరే ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు…కానీ ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. కేవలం సినిమా పరంగా కాకుండా…రాజకీయ కారణాలతోనే షా…ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారని ప్రచారం ఉంది. బీజేపీకి మద్ధతుగా ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించుకోవాలని బీజేపీ చూస్తుందని…మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారు.

చంద్రబాబు..ఎన్టీఆర్‌ని తోక్కేస్తుండటంతోనే…బీజేపీ ముందుకొచ్చిందని, ఎన్టీఆర్‌ సపోర్ట్ తీసుకుంటుందని అంటున్నారు. అలాగే భవిష్యత్‌లో టీడీపీ పగ్గాలు…ఎన్టీఆర్ తీసుకుంటారని చెబుతున్నారు. అయితే ఇదంతా బయటకు జరిగే ప్రచారం..కానీ వాస్తవ పరిస్తితులు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు.  అసలు ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు.

సరే ఈ విషయం పక్కన పెడితే…ఎన్టీఆర్ అభిమానులు ఏ పార్టీ వైపు ఉంటారనేది పెద్ద ప్రశ్న. మామూలుగా మెజారిటీ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ వైపే ఉండేవారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు…ఎన్టీఆర్‌ని దూరం పెడుతూ వచ్చారో అప్పటినుంచి ఎన్టీఆర్ అభిమానులు మారుతూ వచ్చారు. గత ఎన్నికల్లో చాలా వరకు ఎన్టీఆర్ అభిమానులు జగన్‌కే మద్ధతు ఇచ్చారు.

అయితే చంద్రబాబు…ఎన్టీఆర్‌ని తోక్కేస్తున్నారని చెబుతూ…ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు మళ్ళీ వైసీపీకి ఉండేలా కొడాలి ద్వారా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సారి అంత తేలికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.