అమరావతికి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఉంటుందా?

అమరావతి..ఏపీ రాజధాని అని ప్రస్తుతం చెప్పుకోవడానికి లేదు…ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులతో ముందుకొచ్చారు. విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, ఇక ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పి మూడేళ్లు అయింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటున్నారు గాని..అసలు కాన్సెప్ట్ టీడీపీ తీసుకొచ్చిన అమరావతిని దెబ్బ తీయడమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే విశాఖని రాజధాని ఏర్పాటు చేయడానికి కూడా రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. సరే ఏదైతే ఏముంది…జగన్ మూడు రాజధానులు అని మూడేళ్లు అయింది..కానీ ఇంతవరకు ఏర్పాటు కాలేదు. అదిగో త్వరలోనే మంత్రులు అంటున్నారు గాని..ఎప్పుడు అనేది చెప్పడం లేదు. ఎక్కడొక చోట ముందు చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంటే చాలు అని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇటు అమరావతి ప్రజలు, రైతులు ఏమో…అమరావతి ఒకే రాజధానిగా ఉండాలని మూడేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ఫలితంగానే కోర్టులో మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ వెనక్కి తగ్గారు…కానీ కొత్త బిల్లుతో మళ్ళీ ముందుకొస్తామని అంటున్నారు. ఆ ప్రక్రియ అలాగే నడుస్తోంది. ఇదే క్రమంలో అమరావతి ప్రజలు, రైతులు…రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజల మద్ధతు పొందేందుకు చూస్తున్నారు.

ఇప్పటికే న్యాయస్థానం టూ దేవస్థానం అని చెప్పి..అమరావతి టూ తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. మొదటలో పాదయాత్రకు కాస్త ఇబ్బందులు వచ్చాయి..కానీ తర్వాత అందరి మద్ధతు వచ్చింది. ఆఖరికి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వారికి సంఘీభావం తెలిపి…పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు.

ఇక ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి(శ్రీకాకుళం)కు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి డీజీపీ అనుమతి ఇవ్వలేదు. కానీ రైతులు కోర్టుకు వెళ్ళి..పర్మిషన్ ఇచ్చేలా తీర్పు తెచ్చుకున్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర చేయడం లేదని, ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని…ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అంటున్నారు. అలాగే మూడు రాజధానులని ఖచ్చితంగా అమలు చేస్తామని, పాదయాత్రని అడ్డుకుని తీరతామని అంటున్నారు. అయితే అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజల మద్ధతు ఉండొచ్చు..కానీ అక్కడ వైసీపీ శ్రేణులు ఏదొకవిధంగా పాదయాత్రని అడ్డుకునే కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేయొచ్చు.