ఇంచార్జ్‌లకు సీటు..బాబు భలే ట్విస్ట్..!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఏ మాత్రం పట్టు విడవకుండా గెలిచి అధికారంలోకి రావాలని కష్టపడుతున్నారు. అలాగే నేతలు దూకుడుగా పనిచేసేలా చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో బాబు ..ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ, కింది స్థాయిలో వర్గ విభేదాలు, స్ధానిక సమస్యలపై పోరాటాలు, ప్రత్యర్థి నేతల తప్పులను ఎత్తిచూపడం వంటి అనేక అంశాలను ఇంచార్జ్‌ల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే బాబు 59 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో భేటీ అయ్యారు. ఇదే క్రమంలో తాజాగా పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఆదిరెడ్డి వాసులతో పాటు రాజాం ఇంచార్జ్ కొండ్రు మురళితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే నాయకులకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో బాబు ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చారు. ఇప్పటివరకు కొందరు ఇంచార్జ్‌లతో భేటీ అయిన..బాబు కొందరికి సీట్లు ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఆయా నేతలు తమకు సీటు ఇచ్చారని ప్రచారం చేసుకున్నారు. దీన్ని బాబు తీవ్రంగా ఖండించినట్లు తెలిసింది. అసలు సమీక్షల్లో టికెట్ల ఖరారు అంశమే చర్చకు రావడం లేదని, కానీ కొందరు తమకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారని, దీనిని టీడీపీ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుందని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు అనేది అధికారికంగా ప్రకటించారని, కానీ ఇంచార్జ్‌లకు సీటు ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఇక ఇప్పటివరకు సీటు తమదే అని ప్రచారం చేసుకున్న నేతలకు బాబు గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.