గుడివాడ-గన్నవరం వైసీపీకే?

గుడివాడ-గన్నవరం అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు అని అందరికీ తెలుసు…కానీ ఇప్పుడు అవి వైసీపీకి అనుకూలంగా మారిన విషయం కూడా తెలిసిందే. అసలు ఒకప్పుడు గుడివాడ-గన్నవరంలని, టీడీపీని వేరు వేరుగా చూడని పరిస్తితి. ఏ ఎన్నికలైన కృష్ణా జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడతాయనే ధీమా ఉండేది. కానీ టీడీపీ నుంచి ఎదిగి…తమకంటే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇద్దరు లీడర్లు వైసీపీ వైపుకు వెళ్ళడం వల్ల…ఆ రెండు స్థానాలు వైసీపీ అనుకూలంగా మారాయి.

గుడివాడ ఎప్పుడో 2014లోనే వైసీపీ కంచుకోటగా మారిన విషయం తెలిసిందే. కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వెళ్ళడంతో…ఆయన బలం వల్ల 2014, 2019 ఎన్నికల్లో గుడివాడని వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికీ అక్కడ కొడాలి నానికి తిరుగులేదు. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే ఇక్కడ మాత్రం కొడాలిదే గెలుపు.

ఇక గన్నవరం కూడా టీడీపీ కంచుకోటే…అది 2019 వరకే. టీడీపీలో వరుసగా రెండు సార్లు గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడంతో…అక్కడ వైసీపీ బలం పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి బరిలో దిగి సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం లేకే…రెండు చోట్ల వైసీపీ బలంగా ఉంది.

తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో కూడా గుడివాడ-గన్నవరం సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని తేలింది. కేవలం కొడాలి, వంశీల వల్లే రెండు సీట్లు వైసీపీ గెలవనుంది. వీటితో పాటు పామర్రు, నూజివీడు సీట్లని వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. ఇక మైలవరం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందని సర్వేలో తేలింది.

ఇక విజయవాడ వెస్ట్, మచిలీపట్నం, కైకలూరు, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని చెప్పింది. అయితే మచిలీపట్నం, కైకలూరు, తిరువూరుల్లో టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉండగా, విజయవాడ వెస్ట్‌లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పింది. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఈ నాలుగు సీట్లు కూడా వైసీపీకి దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.