ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!

రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు.

అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ యాత్ర అని, ఈ యాత్రని తప్పనిసరిగా అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు అంటున్నారు. అయితే కోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ యాత్ర గుంటూరు జిల్లాలోనే సాగుతుంది. మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి రచ్చ జరుగుతుందనేది అర్ధం కాకుండా ఉంది. ఆ పాదయాత్రని వైసీపీ వాళ్ళు అడ్డుకుంటే..పెద్ద రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో పాదయాత్రకు మద్ధతుగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, అశోక్ గజపతి రాజు, అచ్చెన్నాయుడు…ఇళ్ల ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు అమరావతికి మద్ధతుగా మాట్లాడుతున్నారు. అమరావతి ఒకటే ఏపీ రాజధాని అని గట్టి చెబుతున్నారు. అలాగే మూడు రాజధానుల రిఫరెండంగా జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.

అమరావతే ఏపీకి రాజధాని..రైతుల పాదయాత్రకు అండగా ఉంటామని,  ఎవడు అడ్డువస్తాడో చూస్తామని, రైతులతోపాటు తాము కూడా యాత్రలో పాల్గొంటామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్రలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య రాజధాని విషయంలో రచ్చ జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని విషయంలో ఎలా స్పందిస్తారో తెలియడం లేదు. వారు స్పందన తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే అని చెప్పొచ్చు.