నిఖిల్ కార్తికేయ-2 రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
డా.కార్తికేయ(నిఖిల్) ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు, సమస్యకు ఓ సమాధానం ఉంటుందని నమ్మే వ్యక్తి. అయితే శ్రీకృష్ణుడి ఆభరణాల కోసం ఓ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అనుకోని ఘటన కారణంగా కార్తికేయ, ముగ్ధ(అనుపమ పరమేశ్వరన్)తో కలిసి ఈ గ్యాంగ్ ఉచ్చులో పడతారు. వారిని శ్రీకృష్ణుడి ఆభరణాలు సాధించి పెట్టాలని ఆ గ్యాంగ్ ఒత్తిడి చేస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గ్యాంగ్‌కు హెల్ప్ చేసేందుకు కార్తికేయ రెడీ అవుతాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరికి సంబంధించింది? కార్తికేయ్ వారి ఉచ్చులో ఎందుకు పడతాడు? ముగ్ధ ఎవరు? కార్తికేయ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకున్న నిజాలు ఏమిటి? అనేది వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ‘కార్తికేయ’ మూవీలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి అంశాలనే మరోసారి వాడుకుని, కార్తికేయ-2 చిత్రంతో మనముందుకు వచ్చారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్ చాలా అద్భుతంగా నటించాడు. మొదటి భాగంలో లాగానే, ఈ రెండో భాగంలోనూ నిఖిల్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు.

ఇక కార్తికేయ2 కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో ద్వారకా నగరానికి చెందిన పలు కథనాలు, శ్రీకృష్ణుడికి సంబంధించి పలు అంశాలను చక్కగా ఎలివేట్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడి నగల కోసం జరిగే ఆపరేషన్‌లో ఓ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అయితే కార్తికేయ ద్వారకా నగరానికి ఎలా చేరుకున్నాడనేది మనకు ఫస్టాఫ్‌లో చూపిస్తారు.

అటు సెకండాఫ్‌లో నిఖిల్ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆభరణాల వేటలో ఎలాంటి అడ్వెంచర్స్ చేస్తాడనేది మనకు చాలా చక్కగా చూపించారు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే అవరోధాలు, వాటిని కార్తికేయ అధిగమించిన తీరు బాగా చూపించారు. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ను చాలా చక్కటి అంశాలతో ముగించారు చిత్ర యూనిట్. ఓవరాల్‌గా ఓ చక్కటి మిస్టరీ అడ్వెంచర్ కథను కార్తికేయ-2 సినిమాలో చూపించి ప్రేక్షకులను ఎంగేజింగ్‌లో పెట్టడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

నటీనటులు పర్ఫార్మెన్స్:
కార్తికేయ-2 చిత్రాన్ని హీరో నిఖిల్ సిద్ధార్థ్ వన్ మ్యాన్ షోగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, అడ్వెంచర్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ లేకపోయినా, ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. కమెడియన్ శ్రీనివాస రెడ్డి, వైవా హర్షాలు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ-2 సినిమా కోసం పూర్తిగా సరికొత్త కథను రాసుకున్నాడు. ఆయన తీసుకున్న నేపథ్యం సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే కథలో కొత్తదనం లేకపోయినా, ఆయన దానికి కావాల్సిన థ్రిల్లింగ్ అంశాలను జోడించి కథను బాగా కనెక్ట్ చేస్తాడు. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
కార్తికేయ-2 – నిఖిల్ డిజప్పాయింట్ చేయడు!

రేటింగ్:
3.0/5.0