కాటసానికి షాక్..బనగానపల్లె డౌటే…!

కర్నూలు జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు…ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ హవా నడుస్తోంది…అలాంటిది ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో స్వీప్ చేయడం సాధ్యమయే పని కాదు. పైగా మూడు, నాలుగు సీట్లని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే టీడీపీ ఇంకా కష్టపడితే ఐదారు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో బనగానపల్లె ముందు వరుసలో ఉందని సర్వేల్లో తేలింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మొదట నుంచి బనగానపల్లె కాస్త టీడీపీకి అనుకూలమైన స్థానమే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కోవెలకుంట్ల స్థానంగా ఉండేది. ఆ స్థానంలో నాలుగుసార్లు గెలిచింది.

ఇక బనగానపల్లె ఏర్పాడ్డాక…2009లో ప్రజారాజ్యం నుంచి కాటసాని రామిరెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి బీసీ జనార్ధన్ రెడ్డి గెలిచారు. మళ్ళీ 2019 లో వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకమైన పరిస్తితులు ఏర్పడుతున్నాయి. పైగా గతంలో బీసీ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరగడం లేదు. ఇక ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంతో సానుభూతి కూడా పెరిగింది.

ఇదే క్రమంలో వైసీపీలో కొందరు నేతలు నిదానంగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాటసాని సోదరుడు కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి సైతం వైసీపీని వీడారు. ఇలా సొంత ఫ్యామిలీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో నెక్స్ట్ కాటసాని గెలుపు చాలా కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇక బీసీ జనార్ధన్ రెడ్డి ఇంకా గట్టిగా కష్టపడితే బనగానపల్లె వైసీపీ చేజారే ఛాన్స్ ఉంది.