గెలిచే సీటులో తమ్ముళ్ళ  డ్యామేజ్!

గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుండి టీడీపీ ఏదొకవిధంగా బయటపడుతూ వస్తుంది…అధినేత చంద్రబాబు కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు కష్టపడి పనిచేయడం వల్ల కొన్ని సీట్లలో టీడీపీకి గెలుపు అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన మంచి అవకాశాలని టీడీపీ నేతలే చేతులారా పోగొట్టుకునేలా ఉన్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీకి తమ్ముళ్లే డ్యామేజ్ చేసేలా ఉన్నారు. పాతపట్నం మొదట నుంచి టీడీపీకి అనుకూలమైన స్థానమే. 2004 వరకు ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. తర్వాత నుంచి గ్రూపు తగాదాలు పెరగడం వల్ల ఇక్కడ టీడీపీ గెలుపుకు దూరం అవుతూ వచ్చింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన కలమట వెంకట రమణమూర్తి….టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వెంకటరమణ పోటీ చేయగా, వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేశారు. జగన్ వేవ్ లో శాంతి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఇక్కడ శాంతి పని తీరు మరీ గొప్పగా ఏమి లేదు…ఆమెపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది…అటు వెంకటరమణ దూకుడుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి మంచి విజయాలే అందించారు. హీరా జెడ్పీటీసీ స్థానంలో ఎమ్మెల్యే కుమారుడు ఓడిపోయారంటే…పాతపట్నంలో వైసీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక్కడ టీడీపీ చాలా వరకు లీడ్ లోకి వచ్చింది…నెక్స్ట్ ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో టీడీపీలో వర్గ పోరు పెరిగింది. సీటు కోసం వెంకటరమణతో పాటు మామిడి గోవిందరావు పోటీపడుతున్నారు.  ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్న గోవిందా రావు ఇటీవల కాలంలో దూకుడుగా పనిచేస్తున్నారు. జిల్లాస్థాయిలో మంచి కార్యక్రమాలు చేపడుతూ.. అటు సేవ, ఇటు రాజకీయంలో ముద్ర వేస్తున్నారు.

ఇలా పాతపట్నం సీటు కోసం ఇద్దరు నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు…దీని వల్ల గెలవాల్సిన సీటులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.