పవన్ కొడుకు అకీరా పుట్టుకపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో సినిమాల కంటే రాజకీయాలపై తన పూర్తి సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. జనసేన పార్టీ తరుపున రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఈ కారణంగా ఆయన చేయాల్సిన పలు సినిమా ప్రాజెక్టుకులు కూడా వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో వైసీపీపై ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి మాటలదాడులు పెరిగాయి. ఏకంగా పవన్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వైసీపీ అధికార ప్రతినిధిగా నాగార్జున యాదవ్ ఉన్నారు. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలోనో, టీవీ షోలోనో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్-రేణు దేశాయ్‌లకు పుట్టిన అకీరా నందన్‌ను తాజాగా వివాదంలోకి లాగారు. అకీరా నందన్ పుట్టుకపై వ్యాఖ్యలు చేశారు. అకీరా నందన్‌తో పవన్ తనకు సంబంధం లేదని 2007లో కోర్టులో చెప్పారని నాగార్జున యాదవ్ పేర్కొన్నాడు. కావాలంటే ఈ విషయాన్ని పిటిషన్ నంబరు 590/2007లో పరిశీలించుకోవచ్చని చెప్పారు. విధానాలపై పార్టీల మధ్య విమర్శలు చేసుకోవాలని, కానీ వ్యక్తిగత విషయాలపైనా, కుటుంబాలపైనా విమర్శలు చేస్తున్నారని పలువురు ఆ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. పవన్‌కు మొత్తం మూడు పెళ్లిళ్లు జరిగాయి.

మొదటి భార్యతో విభేదాల కారణంగా పెళ్లైన కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వకుండానే రేణుదేశాయ్‌తో సహజీవనం చేశారు. ఈ జంట కూడా విభేదాల వల్ల విడిపోయింది. ఆ తర్వాత అన్నా లెజనోవాను పవన్ వివాహం చేసుకున్నారు. ఏదేమైనా ఇలా వ్యక్తిగత విషయాలకు లేనిపోనివి జోడించి విమర్శలు చేయడం అందరినీ విస్మయపరుస్తోంది.