పెద్దిరెడ్డి తమ్ముడుతో ఈజీ కాదు?

ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే పెద్దిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని చిత్తు చేసి..వైసీపీని బలోపేతం చేయడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ హావా కొనసాగడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువే.

రాజకీయంగా పెద్దిరెడ్డికి తిరుగులేదు…అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని  చిత్తూరులో ఢీకొట్టే నాయకులు కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దిరెడ్డికి ఎంత బలం ఉందో…ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి బలం ఎక్కువగానే ఉంది. గత రెండు ఎన్నికల్లో మిథున్ రెడ్డి…రాజంపేట ఎంపీగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సత్తా చాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

అలాగే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి కూడా తంబళ్ళపల్లెలో తిరుగులేదనే చెప్పాలి. 2014లో ఈ సీటు టీడీపీ కైవసం చేసుకుంది..కానీ టీడీపీ నుంచి వైసీపీకి దక్కించాలని చెప్పి పెద్దిరెడ్డి…తన సోదరుడుని తంబళ్ళపల్లె బరిలో నిలిపారు. 2019 ఎన్నికల్లో ద్వారకానాథ్ మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే ఎమ్మెల్యేగా అక్కడ దూసుకెళుతున్నారు.

చిత్తూరు వైసీపీలో బలమైన ఎమ్మెల్యేల్లో ద్వారకానాథ్ ఒకరిగా ఉన్నారు. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా ఆయనకు మంచి మార్కులే పడుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డిని ఓడించడం టీడీపీకి చాలా కష్టం. పైగా తంబళ్ళపల్లె టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ ఇంచార్జ్ శంకర్ యాదవ్ ని మార్చాలని టీడీపీ శ్రేణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.

మళ్ళీ శంకర్ కు సీటు ఇస్తే తంబళ్ళపల్లెలో ద్వారకానాథ్ గెలుపు ఈజీ అని టీడీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టాలని డిమాండ్ వస్తుంది. 2009లో ప్రవీణ్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు…కానీ 2014లో వైసీపీలోకి వెళ్ళి తంబళ్ళపల్లెలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటు రాలేదు..తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ని టీడీపీలోకి తీసుకొచ్చి తంబళ్ళపల్లెలో నిలబెడితే ద్వారకానాథ్ రెడ్డికి కాస్త పోటీ ఇవ్వొచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా గాని తంబళ్ళపల్లెలో ద్వారకానాథ్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదు.