ఆత్మ‌కూరులో అస‌లేం జ‌రిగింది.. సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..

కొన్ని కొన్ని ఫలితాలు.. పార్టీల‌ను, నేత‌ల‌ను కూడా ఇబ్బందిలోకి నెడుతుంటాయి. పైకి ఎంతో బాగుంద‌ని అనుకున్నా.. లోలోన మాత్రం అంత‌ర్మ‌థ‌నం త‌ప్ప‌దు. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ ఇదే జ‌రుగు తోంది. దీనికి కార‌ణం.. తాజాగా వ‌చ్చిన నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ఫ‌లితం. ఇక్క‌డ జ‌రిగిన‌న ఉప ఎన్నిక‌లో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ గెలుపై వైసీపీ ఆశించిన‌ట్టుగా జ‌ర‌గలేదు. అందుకే ఎక్క‌డా హంగామా క‌నిపించ‌లేదు.

క‌నీసం.. ట‌పాసులు పేల్చి.. సంబ‌రాలు చేసుకున్న ప‌రిస్థితి కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పోనీ.. ఉప ఎన్నిక క‌దా.. అనుకుందామా? ఇక్క‌డ ప‌దుల సంఖ్య‌లో మంత్రులు ప్ర‌చారం చేశారు. ఎమ్మెల్యేలు కూడా అంత‌కు రెట్టింపు మంది ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించారు. సో.. దీంతో వైసీపీకి ఈ శ‌తాబ్దంలోనే అత్య‌ధిక మెజారిటీ వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ, రాలేదు. అయిన‌ప్ప‌టికీ పైకి బ్ర‌హ్మాండంగా ఉంద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. మంత్రి అంబ‌టి రాంబాబు పార్టీని ఆకాశానికి ఎత్తేశారు.

కానీ, ఇక్క‌డ ప్ర‌చారం చేసిన మంత్రులు మాత్రం సైలెంట్ అయ్యారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? సంబ రాలు లేవు స‌రిక‌దా.. అస‌లు గెలిచామ‌న్న జోష్ కూడా పార్టీలో క‌నిపించ‌లేదు. దీంతో ఇలా ఎందుకు జ‌రిగింద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆశించిన విధంగా ఓట్లు ప‌డ‌క‌పోవ‌డ‌మే కాదు.. కీల‌క‌మైన ఓటు బ్యాంకు త‌గ్గిపోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు ఓటింగ్ శాతం త‌గ్గింది.

అక్క‌డ‌, ఇక్క‌డ కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల హ‌ఠాన్మ‌రణంతోనే ఉప పోరు వ‌చ్చింది. కానీ, అప్ప‌ట్లో జ‌నాలు క్యూక‌ట్టుకుని.. మ‌రీ.. ఓటేస్తే.. ఇప్పుడు మాత్రం ఓటింగ్ శాతం త‌గ్గిపోయింది. పైగా రెడ్డి వ‌ర్గానికి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇలా జ‌ర‌గ‌డం అంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గంలోనే అధికార పార్టీపై న‌మ్మ‌కం పోతోందా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను వైసీపీ అధిష్టానం సీరియ‌స్‌గానే తీసుకుంది. ఈ క్ర‌మంలోనే అస‌లు ఆత్మ‌కూరులో ఏం జ‌రిగిందో తేల్చాల‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం.