తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల యూనియన్లు అనేకమున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే సమయోం మాత్రం కేవలం రెండే రెండు యూనియన్ల పేర్లు బయటకు వస్తాయి. సర్కారు కూడా వారితోనే చర్చలు జరుపుతుంది. మరే సంఘంతోనూ చర్చలు జరిపినట్లు కనిపించడం లేదు. ఆ రెండు సంఘాలు ఏవంటే.. ఒకటి టీజీఓ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), మరొకటి టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్). ఉద్యగులకు ఏ సమస్య వచ్చినా ఈ రెండు సంఘాల నుంచే నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళతారు. దీంతో మిగతా ఉద్యోగ సంఘాలు సర్కారుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారితోనేనా డిస్కషన్స్, మాతో చేయరా? మేము ఉద్యోగులం కామా? మాది సంఘం కాదా? అనేది వారి బాధ. అయితే సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, టీచర్ల అసోసియేషన్లు కలిసి కట్టుగా పనిచేశాయి. టీజీఓ, టీఎన్జీఓలకు దీటుగా పోరాడాయి. అయితే తమ పోరాటాన్ని మాత్రం ఇపుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అయితే ఉపాధ్యాయ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కేవలం పీఆర్టీయూ నాయకులతోనే చర్చలు జరుపుతున్నారు. ఇది మిగతా టీచర్ సంఘాల నాయకులకు రుచించడం లేదు. పీఆర్టీయూ లో మాత్రమే టీచర్లున్నారా? మా సంఘంలో లేరా? మమ్మల్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పీఆర్సీ తదితర సమస్యపై చర్చించేందుకు ఏ సంఘం రావాలనే విషయంపై సర్కారుకు ఫుల్ క్లారిటీ ఉంది. ఈ సంఘాలను కాదని ఇతర సంఘాల నాయకులను పిలిస్తే వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేం.. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తున్నారని సమాచారం. ఇటీవల ఉద్యోగుల విభజన సమస్యపైనా సర్కారు పెద్దలు టీజీఓ, టీఎన్జీఓలతోనే మాట్లాడారట. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఈ చర్యల వల్ల ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయలు వస్తున్నాయని, ఒక సంఘాన్ని మరో సంఘం నమ్మే పరిస్థితి లేదని పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అయినా తమను చర్చలకు ఆహ్వానించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.