రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ముఖ్యంగా కాంగ్రెస్ గూటిలో కలకలం రేపింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రగతి భవన్ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఆ అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది.
రేవంత్ రెడ్డి టీ.కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత రాజగోపాల్ సైలెంట్ అయ్యాడు. రేవంత్ ను పార్టీ అధ్యక్షుడిని చేయడం ఆయనకు ఇష్టం లేదు. వ్యతిరేకించాడు కూడా. దాదాపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. గాంధీ భవన్ వైపు అస్సలే చూడటం లేదు. సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ నేతలతో దోస్తీ కంటిన్యూ చేస్తున్నా రాజగోపాల్ మాత్రం ససేమిరా అంటున్నాడు. ఎప్పుడైనా ఆయన తెలంగాణ భవన్ వైపు వెళ్లవచ్చని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ రాజగోపాల్ సీఎం ఇంటి తలుపు తట్టాడు. ఇదిలా ఉండగా తాను సీఎం వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదని, తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికే అని రాజగోపాల్ ఆ తరువాత క్లారిటీ ఇచ్చారు. అయినా.. రాజకీయ నాయకులు, పరిశీలకుల్లో మాత్రం ఎక్కడోఅనుమానం కొడుతోంది. ఏ క్షణమైనా రాజగోపాల్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమని భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.