ఒక సినిమా తో మరొక సినిమా సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నాడు సత్యదేవ్. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సత్యదేవ్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. హీరోగా మారిన తన పంథా మార్చుకోలేదు సత్య దేవ్. నచ్చితే వెబ్ సిరీస్ చేయడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇటీవలే స్కైలాబ్ అనే డిఫరెంట్ మూవీతో ముందుకొచ్చిన సత్యదేవ్ తాజాగా నటిస్తున్న సినిమా గాడ్సే. ఈ సినిమాకు గోపి గణేష్ దర్శకత్వం వహిస్తుండగా సీకే స్క్రీన్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నాడు.
మలయాళం నటి ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా పరిచయమవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇవాళ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి టీజర్ ను విడుదల చేసాడు. ఎప్పట్లాగే సత్యదేవ్ టీజర్ లో కూడా ఆకట్టుకున్నాడు. ప్రభుత్వాల అవినీతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ లో సత్యదేవ్ పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
‘ సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. రాజకీయాల్లో సేవలు చేస్తే వందల ఎకరాలు, లక్షల కోట్లు ఎలా వస్తాయి రా’ అని సత్య దేవ్ చెప్పిన డైలాగ్ పేలుతోంది. టీజర్ చూస్తే నేటి రాజకీయాలు, ప్రభుత్వ అవినీతిపై గాడ్సే గన్ ఎక్కు పెట్టినట్లు తెలుస్తోంది. సత్యదేవ్ కెరీర్లో గాడ్సే కూడా మరో డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.