ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వు లేనిదే బతకలేను.. అని అన్నాడు. ఆ ప్రేమకు పొంగిపోయిన యువతి యువకుడికి ఓకే చెప్పింది. ఇంకేముంది ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా యువకుడు మోసం చేశాడు. ప్రియురాలికి మాటయినా చెప్పకుండా మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తను ప్రేమించిన యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. అంతటితో కోపం చల్లారక కత్తితో పొడిచింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో జరిగింది.
కేరళ రాష్ట్రానికి చెందిన రాకేష్, తమిళనాడు కాంచీపురంకు చెందిన జయంతి(27) దుబాయ్ లో ఉద్యోగాలు చేసేవారు. అప్పుడే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆరు నెలల కిందట ఇద్దరూ దుబాయ్ నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో రాకేష్ జయంతికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆమెకు తెలియకుండా ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయం జయంతికి ఆలస్యంగా తెలిసింది. రాకేష్ కు ఫోన్ చేసి నిలదీసింది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాకేష్ కోయంబత్తూర్ కు వచ్చాడు. పీలమేడు ప్రాంతంలో జయంతి ని కలిసి మాట్లాడాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్ ను రాకేష్ పై పోసింది. అంతటితో కూడా తనకు కోపం చల్లారక పోవడంతో అతడిపై కత్తితో దాడి చేసింది.
ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేందుకు నిద్రమాత్రలు వేసుకుంది. ఇద్దరు అచేతనంగా పడి ఉండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమిళనాడులో ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.