ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఏకంగా…?

సాధారణంగా ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తెలిసిన వారిని పది మందిని అడుగుతాం. ఇప్పుడు అంటే సోషల్ మీడియా హవా నడుస్తుంది కాబట్టి తెలియని వ్యక్తులను కూడా ప్రశ్నలు అడగడం సాధ్యమవుతుంది. వంద కిలోమీటర్ల దూరం పరుగెడుతున్న ట్రైన్ ను 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు దాటడానికి ఎంత సమయం పడుతుంది? అనే ఫిజిక్స్ ప్రశ్నలు మీరు వినే ఉంటారు. వీటిని అడిగేటప్పుడు మాటల రూపంలో ప్రశ్నను వివరిస్తారు కానీ నిజంగానే ట్రైను, కారు తీసుకొచ్చి మరీ ప్రశ్నలు వేయరు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం ఇదే తరహాలో ప్రశ్న అడిగి నెటిజన్ల అందరికీ షాకిచ్చాడు. ఇతనికి ఫిజిక్స్ కు సంబంధించి ఒక ప్రశ్న మెదడులో మెదిలింది. దాంతో ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషించేందుకు అతడు ఏకంగా హెలికాప్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. గమ్మత్తేమిటంటే, అతడు చివరికి సమాధానం కూడా కనిపెట్టేసి వావ్ అనిపించాడు. ఇంతకీ అతడి పేరేంటో, ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటో తెలుసుకుందాం రండి.

డెరిక్ ముల్లర్ అనే ఒక వ్యక్తి వెరిటాసియం అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. 2014 అమెరికా ఫిజిక్స్ ఒలింపియాడ్ వేదికగా విద్యావేత్తలు అడిగిన ఓ ప్రశ్న అతడిని బాగా డిస్టర్బ్ చేసింది. హెలికాప్టర్ గాల్లో ఎగురుతున్న సమయంలో కేబుల్ కిందికి ఏకరితీ కేబుల్ వేస్తే ఎలా వేలాడుతుంది? అని ఫిజిక్స్ ఒలింపియాడ్ లో 19వ ప్రశ్నగా అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలని నిర్ణయించుకున్నాడు ముల్లర్. ఇందుకోసం ఏకంగా ఓ హెలికాప్టర్ అద్దెకు తీసుకుని పెద్ద ప్రయోగం చేశాడు. ప్రశ్నలో అడిగినట్టుగానే అవసరమైన అన్ని వస్తువులు తనతో పాటే తీసుకెళ్లి హెలికాప్టర్ ఎక్కేశాడు. అనంతరం గాల్లో నుంచే ప్రశ్నను చదివి వినిపించి సరైన ఆన్సర్ ఏంటో గెస్ చేయాలని ఫాలోవర్స్ ని అడిగాడు. ఆ తర్వాత ప్రయోగం చేసి సరైన సమాధానం కనుక్కున్నాడు. ఈ ప్రయోగానికి ముందు ట్విట్టర్ అకౌంట్‌లో తాను పోస్టు చేసిన ప్రశ్నకు చాలా మంది నెటిజన్లు జవాబులు కూడా ఇచ్చారు. అయితే ఒక ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానం ప్రయోగాత్మకంగా చూపించిన ముల్లర్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.