రైతు చట్టాల రద్దు.. కమలం నేతల మౌనం

రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలుచేయాలని నానా యాగీ చేసిన టీబీజేపీ నేతలు ఇపుడు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. కేసీఆర్ పై అగ్గిమీద గుగ్గిలమయ్యే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ మౌనముద్రం దాల్చారు. మూడు రైతు చట్టాలను రద్దుచేస్తూ రైతులకు ప్రధాన మంత్రి మోదీ క్షమాపణ చెప్పిన అనంతరం ఎందుకో స్థానిక నాయకులకు మాటలు రావడం లేదు. మోదీ ప్రకటనను ఒకటికి రెండు సార్లు కమలం నాయకులు కన్ఫర్మ్ చేసుకున్నారు. అరె.. సడన్ గా ఈ నిర్ణయమేంటి అని బీజేపీ నాయకులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు.

శుక్రవారం మోదీ రైతు చట్టాల రద్దును ప్రకటించిన తరువాత ఒక్కరు కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాలేదు. బీజేపీ నాయకుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమోనని చూసిన మీడియా ప్రతినిధులకు నిరాశే ఎదురైంది. ఈటల రాజేందర్, రఘునందన్ ఇళ్లల్లోనే ఉండిపోయారు. మీడియాను కలిసేందుకు కూడా వారు ఇష్టపడలేదు. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నగర శివారులో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోయారు. అయితే.. రైతు చట్టాల రద్దు విషయంపై ఎవరూ మాట్లాడవద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ అధికార ప్రతినిధులు కూడా మౌనరాగం పలుకుతున్నారు. ఉద్యోగులు, కిందిస్థాయి కార్యకర్తలు తప్ప పార్టీ కార్యాలయం వైపు ఎవరూ రాలేదు. మోదీ సడన్ ప్రకటనతో బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారనే చెప్పవచ్చు. మొన్ననే సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ధర్నా చేయడం.. కేంద్రంపై యుద్దం ప్రకటించడం.. మరుసటి రోజే మోదీ ఇలా చేయడాన్ని స్థానిక కమలం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వల్లే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ నాయకులు చెబుతుంటే కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు కమలం నాయకులు. నిదానంగానైనా స్పందిస్తారేమో చూడాలి మరి.