ఎర్రబెల్లికి త్రెట్..బండ ప్రకాశ్ కు చాన్స్..

ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీనియర్ లీడర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన నాయకుడు.. ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున, ఈసారి టీఆర్ఎస్ తరపున శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత సీనియర్ అయిన ఎర్రబెల్లికి టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. అయితే.. కేసీఆర్ 2.0లో మాత్రం ఆ చాన్స్ దక్కింది. మంత్రి హోదా అనుభవిస్తూ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే.. ఎర్రబెల్లి మాత్రం ఇపుడు సంతోషంగా లేరు. ఎందుకంటే బండ ప్రకాశ్ రూపంలో ఆయన మంత్రి పదవికి ముప్పు పొంచి ఉందని తెలిసింది. దీంతో అరె.. పూర్తి కాలం మంత్రిగా పనిచేసే అవకాశం లేకుండో పోతోందని సన్నిహితులతో పేర్కొంటున్నట్లు తెలిసింది. కేసీఆర్ కోరిక మేరకే టీడీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎర్రబెల్లికి మంత్రి పదవి అవకాశం ఇస్తానని పార్టీ హామీ ఇచ్చింది. దీంతో ఎర్రబెల్లి.. తన తోటి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను కారెక్కించారు.

అయితే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చాన్స్ ఇవ్వలేదు. మరోసారి పవర్ లోకి వచ్చిన తరువాత 2019 ఫిబ్రవరిలో ఆయన అమాత్యులయ్యారు. ఈ ఫిబ్రవరికి మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే కనీసం మూడేళ్లు కూడా కాకుండా పదవి పోయే ప్రమాదం వచ్చి పడింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని పార్టీ అధినేత భావిస్తున్నారట. అయితే బండకు చాన్స్ ఇవ్వాలంటే ఎవరిని తప్పించాలని ఆలోచిస్తే ఎర్రబెల్లి కనిపిస్తున్నారట. వచ్చే జనవరిలో సంక్రాంతి అనంతరం ఎర్రబెల్లి మాజీ కానున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. ఒకరు ఎర్రబెల్లి అయితే.. ఇంకొకరు సత్యవతి రాథోడ్. అయితే సత్యవతి ఎస్టీ వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమెను తీసే చాన్స్ లేదు. అందుకే ఎర్రబెల్లిని తప్పించి అదే జిల్లాకు చెందిన బీసీ నేత బండ ప్రకాశ్ కు కేబినెట్ హోదా కల్పించనున్నారని తెలిసింది.