బాబుకు బీజేపీ నేతల సపోర్టు..

చంద్రబాబు నాయుడు.. రాజకీయ ఉద్దండుడు.. పాతసినిమాల పద్ధతిలో చెప్పాలంటే గండరగండడు..ఇప్పటి సినిమా స్టైల్లో అయితే ఒకే ఒక్కడు..అటువంటి వ్యక్తి మీడియా సమావేశంలో బహిరంగంగా వెక్కి వెక్కి ఏడ్చాడు.. రాష్ట్రం మొత్తం చూస్తుండగా.. కెమెరాలన్నీ ఆయనపై ఫోకస్ చేయగా .. కళ్లు మొత్తం చెమర్చాయి.. మొహం చేతుల్లో దాచుకొని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నాడు..దాదాపు రెండు నిమిషాల పాటు రోదించాడు.. విలేకరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. కెమెరాలు మాత్రం అన్ని యాంగిల్స్ లో బాబు బాధను షూట్ చేస్తున్నాయి.. ఆ తరువాత నెమ్మదిగా తేరుకొని ’’రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగుతారా.. అసలు రాజకీయాలంటే గిట్టని భార్యను మాటలంటారా..ఇదేనా పద్ధతి‘‘ అని కన్నీటి పర్యంతమయ్యారు. సభలో ఇంత అవమానం జరిగితే ఎలా? అందుకే ఇక ఈ కౌరవసభకు నేను రాను అని శపథం చేసి మీడియా సమావేశంలో బాధపడి.. తరువాత హైదరాబాద్ వచ్చేశారు. ఇదీ చంద్రబాబు వేదన.. ఆవేదన..బాధ..

ఇక సీన్ కట్ చేస్తే బాబుకు తెలుగు తమ్ముళ్లు బాసటగా నిలిచారు. నీ వెంటే మేముంటామని బాస చేశారు. ఆ.. వారంతా సొంత పార్టీ వాళ్లే.. ఆ మాత్రం సపోర్టు ఇవ్వకపోతే ఎలా? అందుకే ఇచ్చారు. ఇక బీజేపీ నాయకులు సైతం బాబుకు మద్దతుగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి.. మోదీతో విభేదించి బయటకు వచ్చిన తరువాత బీజేపీ, టీడీపీలు ఉప్పు, నిప్పులా మారిన సంగతి తెలిసిందే. అయితే.. సడన్ గా ఇపుడు బీజేపీ నాయకులు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకురాలు, భువనేశ్వరి సోదరి పురందేశ్వరి ఈ విషయంలో వైసీపీ నాయకులపై భగ్గుమన్నారు. క్యారెక్టర్ ను తప్పుపట్టడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇక సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా బాబుకు సపోర్టుగా వచ్చారు. వైసీపీ నాయకుల తీరును వారు తప్పు పట్టారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా వీరికి మద్దతు పలికారు. విచిత్రమేమంటే వీరంతా గతంలో తెలుగుదేశంలో ఉన్న వారే. తమ మాజీ బాస్ కు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక మీడియా ముందుకు వచ్చారు. మేము కూడా నీ వెంటే ఉంటాం బాబూ అని చెప్పకనే చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమేమంటే బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఈ విషయం గురించి అస్సలు మాట్లాడటం లేదు. అంటే.. బీజేపీ సపోర్టు బాబుకు లేనట్టే కదా..