మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల వలస నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత వైసీపీలో చేరి విజయం సాధించారు. తరువాత స్పీకర్ అయిన సంగతి తెలిసిందే.

ఆయనకున్న విశేష అనుభవం ద్రుష్ట్యా స్పీకర్ పదవిని చేపట్టాలని జగన్ మరీ..మరీ కోరినట్లు.. కాదనలేక తమ్మినేని ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే..ఎన్నాళ్లీ చాంబర్ లో కూర్చొని ఉండాలి.. ప్రజల మధ్యకు వెళ్లి వారికేమైనా చేయాలంటే ఎలా.. మంత్రి పదవి ఉంటే ఆ లుక్కే వేరప్ప.. అందుకే మినిస్టర్ కావాలనేది ఆయన ప్రగాఢ కోరిక. అయినా.. తమ్మినేనికి చాన్స్ ఇచ్చే విషయంలో ఇంకా జగన్ క్లారిటీ ఇవ్వలేదట. అయితే ఒకవేళ తమ్మినేనికి చాన్స్ ఇస్తే.. స్పీకర్ చాన్స్ ఎవరికి ఇవ్వాలనేది జగన్ మదిని తొలుస్తున్న ప్రశ్న. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాద రావుకు స్పీకర్ చాంబర్ ఇస్తే.. తమ్మినేనికి బెర్త్ ఖాయమైనట్లు. అయితే.. ఇవేవీ ఇంకా తేలలేదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో కనిపించడం లేదు. ఆ విషయమే ఎక్కడా చర్చకు రావడం లేదు. అయినా తమ్మినేని పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ చుట్టూ తిరుగుతున్నారట. గతంలో రాజకీయ జీవితం ఇచ్చింది ఎన్టీఆర్ అయితే.. ఇపుడు జగన్ అని సన్నిహితులతో చెబుతున్నారని సమాచారం.