ప్రేక్షకా.. కాచుకో ఇక.. దసరా, దీవాళి, సంక్రాంతికి సినిమాల జాతర..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. షూటింగ్ పూర్తయిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఇక సినిమాలు విడుదలకు వరుసగా సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ లో సినిమాల విడుదలకు నాలుగు ప్రధాన సీజన్లు ఉన్నాయి. సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి సీజన్ లలో ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. రానున్న మూడు నెలల కాలంలో 3 సీజన్లు ఉండడంతో వరుసగా ఒక్కొక్క సినిమా విడుదలకు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటోంది.

ఇవాల్టి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో పండుగ లోపు పలు సినిమాలు విడుదల కానున్నాయి. ముందుగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొండపొలం సినిమా 8వ తేదీన విడుదల కానుంది. అలాగే దసరా పండుగ సమయంలో 14న శర్వానంద్, సిద్ధార్థ్ ల మహాసముద్రం, 15న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ శౌర్య వరుడు కావలెను విడుదల కానున్నాయి. 22వ తేదీన నాట్యం సినిమా రిలీజ్ అవనుంది. ఇక 24వ తేదీన బాలకృష్ణ-బోయపాటి అఖండ, అదే రోజు రవి తేజ ఖిలాడి సినిమాలు రిలీజ్ అవుతాయని టాక్.

నవంబర్లో నాగ శౌర్య లక్ష్య, పుష్పక విమానం తదితర చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.క్రిస్మస్ సందర్భంగా పలు భారీ సినిమాలు తెరపై సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య, అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానున్నాయి. అఖిల్ ఏజెంట్, వరుణ్ తేజ్ గని, విజయ్ దేవరకొండ లైగర్, రానా విరాట పర్వం డిసెంబర్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక జనవరిలో సంక్రాంతి సీజన్లో తెలుగు టాప్ హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 7న, పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ 12న, మహేష్ బాబు పరశురామ్ సర్కారు వారి పాట 13న, ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ 14న రిలీజ్ కానున్నాయి. వెంకటేష్, వరుణ్ ఎఫ్ -3 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా మధ్యలో నవంబర్, డిసెంబర్ నెలలో మరి కొన్ని చిన్న సినిమాలు సైతం విడుదల కానున్నాయి.

ఇక తమిళం నుంచి రజనీ కాంత్ అన్నాత్తే దీపావళి సందర్భంగా, అజిత్ వలిమై సంక్రాంతి సందర్భంగా డబ్బింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి.శింబు మనాడు కూడా మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. చాలా నెలల తర్వాత థియేటర్లకు సినిమాలు పోటెత్తుతూ మునుపటి కళ సంతరించుకోవడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.