సారు .. ఆదివారం వరకు హస్తినలోనే ..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మరో మూడు రోజులపాటు ఉంటున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే సిటీకి తిరిగి రావాల్సి ఉంది. అయితే మోదీ, అమిత్ షాలను కలిసిన తరువాతే రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంఓను అధికారులు సంప్రదించారు. పీఎంఓ ఓకే అంటే.. మోదీని కలిసి ఆ తరువాత అమిత్ షాను కలుస్తారు. పార్టీ కార్యలయానికి భూమి పూజ చేసేందుకు కేవలం పార్టీ పనిమీద వెళ్లిన సీఎం బీజేపీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారట. అంతేకాక టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర గురించి చూడా మాట్లాడనున్నట్లు సమాచారం.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళితబంధు పథకం ప్రవేశపెట్టారనే విమర్శలు రావడంతో ఆ పథకం గురించి కూడా మోదీకి వివరించనున్నారు. పనిలోపనిగా తెలంగాణకు రావాల్సిన నిధులు, నీళ్ల గురించి కూడా వినతిపత్రం అందిస్తారు. పనిలోపనిగా హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి కూడా కేంద్రంలోని పెద్దలకు వివరించి నోటిఫికేషన్ గురించి గుర్తు చేస్తారని తెలిసింది. ఇపుడు కేసీఆర్ ఎదుట ఢిల్లీలో ఇన్ని టాస్కులున్నాయి.. అందుకే సండే వరకు నో సిటీ అంటున్నట్లు తెలిసింది.