ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నా.. ఐటీ దాడుల తర్వాత సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..!

 

దేశంలో కరోనా విజృంభణ తరువాత వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు సమర్థవంతంగా పని చేయలేక పోయాయని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు స్వయంగా ముందుకు వచ్చి కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరినో ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సామాగ్రిని పంపిణీ చేశారు. అలాగే ఆస్పత్రులకు వివిధ వైద్య పరికరాలు అందించారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో చేసిన సేవలకు గాను ప్రజల్లో ఎంతో గుర్తింపు సాధించారు. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఆయన ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఆయనను ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా సోనూసూద్ తన సేవలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. చివరకు ఐటీ అధికారులు సోనూసూద్ రూ. 20 కోట్ల మేరకు పన్ను ఎగ్గొట్టినట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సోనూ సూద్ పై దాడులు నిర్వహించిందని సోషల్ మీడియా ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఐటీ దాడుల తర్వాత నోరు విప్పని సోనూ సూద్ తాజాగా స్పందించారు. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు.’ ప్రతి భారతీయుడి ప్రార్థనల ప్రభావం ఎంత ఎలా ఉంటుందంటే.. అధ్వానంగా ఉన్న రోడ్ల లో కూడా ప్రయాణం అత్యంత సులభం అవుతుంది’ అని పేర్కొన్నారు. ‘ నీలోని నిజాయితీ గాధను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే అది తెలియజేస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడిఉన్నా. అది నాకు ఎంతో బలాన్నిస్తుంది. నా ఫౌండేషన్ తరపున ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ఒక విలువైన జీవితాన్ని కాపాడుతోంది. అర్హులకు కూడా అందుతోంది.

నేను చేస్తున్న ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అవసరమైన వారికి అందిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగుతుంది. నాలుగు రోజులుగా నేను ఎంతో బిజీగా ఉన్నాను. కొంతమంది అతిథుల కారణంగా ప్రజలకు సేవ చేయలేకపోయాను. తిరిగి నా సేవలను కొనసాగిస్తాను. నా జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. జైహింద్..సోనూ సూద్’ అని ట్వీట్ చేశాడు.