టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు..?

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినది.. ఓడినది పో మేమెందుకు గెలవవలె.. గెలిచితిమి పో వైసీపీలోకి ఎందుకు చేరవలె.. చేరితిమిపో ..ఇప్పుడేమి చేయవలె? అన్నట్టుంది నలుగురు ఎమ్మెల్యేల పరిస్థతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో సాధారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరారు. వారు ఏ ఉద్దేశంతో చేరారనే విషయం పక్కనపెడితే అధికార పార్టీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,వాసుపల్లి గణేశ్, కరణం బలరాం.. ఈ నలుగురు పసుపు కండువా తొలగించి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే తొలి నాళ్లలో వీరి పరిస్థితి బాగానే ఉండింది. ఈ నలుగురితోపాటు చాలా మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని ఇరు పార్టీల నాయకులూ భావించారు. చంద్రబాబు కూడా ఊహించి ఉండవచ్చు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అప్పుడు వారంతా ఏదో ఒక లబ్దిపొందారు.

ఇపుడు ఈ నలుగురు మాత్రం.. ఇక్కడ ఉండలేక.. అక్కడకు వెళ్లలేక సతమతమవుతున్నారట. విచిత్రమేమంటే.. గతంలో సీఎం జగన్ వీరికి ఒకటి, రెండుసార్లు కలవడానికి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత వీరికి జగన్ అపాయింట్ మెంట్ దొరకడమే గగనమైందట. సీఎంతోపాటు పార్టీ కూడా వీరిని పట్టించుకోవడం లేదని వాపోతున్నారని సమాచారం. ముందునుంచీ వైసీపీలో లేరు కాబట్టి నాయకులు కూడా కార్యక్రమాలకు పిలవడం మరచిపోయారు. కనీసం పార్టీలో వీరి అభిప్రాయాలను అడిగే నాథుడే కరువుయ్యారు. పంచాయతీ ఎన్నికలు, ఇతర ఎన్నికల్లో వీరు ఎంపిక చేసిన అభ్యర్థులను పక్కనపెట్టేశారట. దీంతో వైసీపీలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకొచ్చమా అని మనోవేదన పడుతున్నారని సమాచారం.