గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు ప్రవీణ్ ను విమర్శించేందుకు ముందుకు రావడం లేదు.. అసలు ఆయనను విమర్శించడమంటే మనల్ని మనమే విమర్శించుకోవడమని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

ఆర్ఎస్పీని తామే నేరుగా కాకుండా దళిత శాసనసభ్యులతో టార్గెట్ చేయించాలని గులాబీ బాస్ అనుకుంటే.. ఎవరూ ముందుకు రావడం లేదట. ఒకరు జ్వరమొస్తుందని.. మరొకరు హైదరాబాదులో లేనని ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు సమాచారం. కష్టపడి తుంగదుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ను మాట్లాడించేందుకు ఒప్పించారు. ఆయన ఆర్ఎస్పీ పై వ్యాఖ్యలు చేసిన అనంతరం సోషల్ మీడియాలో నెగిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. తరువాత ఆయన కూడా సైలెంట్ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న ఈ సమయంలో.. హుజూరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశమున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎస్పీని దీటుగా ఎలా ఎదుర్కోవాలో గులాబీ బాస్ తగిన స్కెచ్ వేస్తున్నారని తెలిసింది. భవిష్యత్తులో బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.