పీకే ఉడుం ప‌ట్టుతో మైండ్ బ్లాకే..!

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి మూడు గండాలు వెంటాడుతున్నాయి! వాటిలో ప్ర‌ధాన‌మైంది పార్టీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రి. రెండు ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి. మూడు పార్టీలో ఎప్పుడు ఎవ‌రు ఎటునుంచి జంప్ చేసేస్తారో న‌నే భ‌యం! ఈ మూడు విష‌యాలూ వైసీపీని ప‌ట్టి పీడిస్తున్నాయి. ఎలాగైనా స‌రే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు. అయినా కూడా ఆయ‌న‌కు ఆయ‌న వైఖ‌రే ప్ర‌ధ‌మ శ‌తృవుగా ప‌రిగ‌ణించింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ నిరాశ నిస్పృహ‌లు త‌లెత్తుతున్నాయి.

అయితే, ఇటీవ‌ల కాలంలో ఉత్త‌రాది నుంచి దిగుమ‌తి చేసుకున్న ప్ర‌శాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇస్తున్న స‌ల‌హాలు, అమ‌లు చేస్తున్న కార్యాచ‌ర‌ణ వంటివి వైసీపీని మ‌ళ్లీ నిల‌బెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌ర్వేలు, ఫ‌లితాలు అంటూ రాష్ట్ర ప‌రిస్థితిని తెలుసుకున్న పీకే ఇప్పుడు తాజాగా పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను  భుజానికి  ఎత్తుకున్నారు. వరుస ఓటములతో డీలా పడిన వైసీపీ శ్రేణులు పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నవరత్నాల సభ, వైఎస్ కుటుంబం వంటి కార్యక్రమాలను కూడా ఏదో చేశామంటే చేశామనిపిస్తున్నారు. దీంతో పార్టీ తీవ్ర సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. 

మ‌రోప‌క్క‌, న‌వంబ‌రు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు. దీనికి ముందు అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక రకమైన సానుకూల వాతావరణాన్ని కలుగజేయాలన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహం. అందుకోసమే వరుస కార్యక్రమాలను చేప‌ట్టారు. నియోజకవర్గాల వారీగా తన టీంను దించారు. స్థానికంగా ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేయిస్తున్నారు. దీంతో స్థానిక నేత‌లు కూడా పీకే టీం వచ్చిందని తెలియడంతో అలర్ట్ అవుతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. 

నిన్న మొన్నటి వరకూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వర్గాలు పోటాపోటీగా విజ‌య‌న‌గ‌రంలో కార్యక్రమాలను నిర్వహించేవారు. అయితే, అనూహ్యంగా విజయనగరం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా స్పష్టం చేశారు. దీంతో విజయనగరం జిల్లాలో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ జిల్లాలో వైఎస్ఆర్‌ కుటుంబం కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని తెలిసిన పీకే వెంటనే తన టీంను పంపారు.

ఏకంగా పన్నెండు మందితో కూడిన బృందాన్ని పంపారు. తొమ్మిది మంది  పార్టీ కార్యక్రమాలు నిర్వ‌హించే బాధ్యతను తీసుకున్నారు. ఒకరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగాను, మిగిలిన ఇద్దరూ మీడియా ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. వారే దగ్గరుండి పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. మీడియాకు సమాచారం అందిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన నవరత్నాల సభ, వైఎస్ కుటుంబ కార్యక్రమాన్ని పీకే టీం దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. దీంతో వైసీపీ తిరిగి పుంజుకుంటుంద‌నే భావ‌న ఏర్ప‌డుతోంది.