ఆశ‌ల్లేని వ‌ర్ల‌…. నాన్ లోక‌ల్ ఆప్ష‌న్స్‌..!

ఏపీలో అధికార టీడీపీకి త‌ర‌పున మీడియాలో వాయిస్ బ‌లంగా వినిపించే వ్య‌క్తుల్లో వ‌ర్ల రామ‌య్య ఒక‌రు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్రెస్‌మీట్ల‌తో టీడీపీ త‌ర‌పున హైలెట్ అయిన వ‌ర్ల‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట అయిన ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రు సీటు ఇచ్చారు. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయిన వ‌ర్ల ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఉప్పులేటి క‌ల్ప‌న చేతిలో 700 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు వ‌ర్ల కష్టాన్ని గుర్తించి ఆయ‌న‌కు ఏపీ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పామ‌ర్రులో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాల‌ని క‌ల‌లు కంటోన్న వ‌ర్ల‌కు ఉప్పులేటి షాక్ ఇచ్చారు. కల్ప‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో టీడీపీలోకి వ‌చ్చేయ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పామ‌ర్రు సీటును చంద్ర‌బాబు ఆమెకే దాదాపు రిజ‌ర్వ్ చేసేశారు. పైగా ఆమె టీడీపీలో పాత‌కాపు. టీడీపీలో ఆమె నిడుమోలు నుంచి ఓసారి పామ‌ర్రులో మ‌రోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక క‌ల్ప‌న ఎస్సీ లేడీ కావ‌డంతో ఆమెకు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం చంద్ర‌బాబుకు అనివార్య‌మైంది.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పామ‌ర్రులో పోటీ చేయాల‌న్న వ‌ర్ల ఆశ‌లు హుష్ కాకి కావ‌డంతో నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న క‌ల్ప‌తో చీటికిమాటికి గొడ‌వ ప‌డ్డారు. బాబు వార్నింగ్‌తో కాస్త సైలెంట్ అయిన వ‌ర్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పామ‌ర్రు కాకుండా మ‌రో ఆప్ష‌న్ చూస్తాన‌ని బాబు హామీ ఇచ్చిన‌ట్టు టాక్‌. జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌ను ప‌క్క‌న పెడ‌తార‌న్న టాక్ వ‌స్తోంది. దీంతో వ‌ర్ల‌ను నందిగామ‌కు పంప‌డం లేదా తిరువూరులో మూడుసార్లు ఓడిపోయిన న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాసును ప‌క్క‌న పెట్టి తిరువూరులో గాని వ‌ర్ల‌కు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

అలాగే వ‌ర్ల‌కు అస‌లు కృష్ణా జిల్లాలో కాకుండా ప‌శ్చిమ‌గోదావ‌రి లేదా గుంటూరు జిల్లాల్లో సీటు ఇచ్చే అంశంపై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రిలో మాజీ మంత్రి పీత‌ల సుజాతకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు రాద‌న్న‌ది దాదాపు క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే. వ‌ర్ల పేరును చింత‌ల‌పూడి లేదా గోపాల‌పురంకు ప‌రిశీలింవ‌చ్చంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అయిన మాజీ మంత్రి రావెల‌కు సీటు రాద‌ని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ప్ర‌త్తిపాడులో అయినా వ‌ర్ల బ‌రిలోకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యర్ధులపై విరుచుకుపడే వర్లకు తాను ప్ర‌స్తుతం ఉన్న ప‌ద‌వి అస్స‌లు ఇష్టం లేదు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల‌ని ఆయ‌న విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ‌ద్ద త‌న కోరిక చెప్పుకోగా ఆయ‌న పామ‌ర్రు కాకుండా మ‌రో ఆప్ష‌న్‌పై హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి వ‌ర్ల ఎమ్మెల్యే పోటీ కోరిక ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తీరుతుందో ?  చూడాలి.