లండ‌న్‌లో జ‌గ‌న్‌…వైసీపీలో అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌

ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల దృష్టి అంతా జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌పైనే ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవ‌డం, ప్ర‌జ‌ల్లో సింప‌తీ లేద‌ని తేలిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌ట్టా బుట్టా స‌ర్దు కుంటార‌ని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు బ‌లం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న తాజాగా నిన్న మాట్లాడుతూ.. క‌నీసం 12 మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని సిగ్న‌ల్ ఇస్తే చాలు జంప్ అయిపోతార‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో కొత్త వాద‌న తెర మీద‌కి వ‌చ్చింది. ప్ర‌స్తుతం లండ‌న్ టూర్‌లో ఉన్న జ‌గ‌న్‌.. ఇండియాకి వ‌చ్చేలోపే కొంద‌రు ఎమ్మెల్యేలు కండువా మార్చేసుకునేందుకు త‌హ‌త‌హ లాడుతున్నార‌ని అంటున్నారు. లేక‌పోతే.. జ‌గ‌న్ వ‌స్తే.. పంచాయితీలు పెడ‌తాడ‌ని, ఆయ‌న మాట‌ల‌ను, సెంటిమెంటును తాము త‌ట్టుకోలేమ‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎవరు వెళతారు? ఎవరు పార్టీని నమ్ముకుని ఉంటారు? అన్న విష‌యం మాత్ర క్లారిటీ లేదు. జంప్ చేస్తున్నార‌ని ఉప్పందిన వారితో వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు.

వారికి ఫోన్ చేసి జరుగుతున్న ప్రచారంపై ఆరా తీస్తున్నారు. అయితే ఎవరూ తాము పార్టీని వీడటం లేదనే చెబుతున్నారు. తాము ఎందుకు పార్టీని వీడతామని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. తాము వచ్చే ఎన్నికలలోనూ ఖచ్చితంగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక‌, కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. రఘురామిరెడ్డి గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అదే పార్టీ టిక్కెట్ పై గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కాని రఘురామిరెడ్డి మాత్రం జరుగుతున్న ప్రచారం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే అయినా తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాయలసీమలోని మరికొందరి ఎమ్మెల్యేలు పేర్లు కూడా విన్పిస్తున్నాయి. కాని ఈ ప్రచారాన్ని వారందరూ ఖండిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రి పార్టీ మారిన వాళ్లూ లేకపోలేదు. గ‌తంలో ఇంత‌క‌న్నా ఎక్కువ ప్రేమ ఒల‌క‌బోసిన నేత‌లే వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. కాబ‌ట్టి ప‌రిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం.