ఎమ్మెల్యే సీటుపై ఇద్ద‌రు వైసీపీ ఎంపీల క‌న్ను..!

నంద్యాల‌, కాకినాడ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో విప‌క్ష వైసీపీ రాజకీయంలో కాస్త దూకుడు త‌గ్గింది. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు దూకుడుగా ముందుకు వెళ్లిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు ఈ రెండు ఎన్నిక‌ల త‌ర్వాత డిఫెన్స్‌లో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటోన్న వారు సేఫ్ గేమ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాము ప్ర‌స్తుతం ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌కు అనుకూలంగా కావ‌న్న నిర్ణ‌యానికి వ‌స్తే వారు మ‌రో నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేస్తున్నారు.

మాజీ మంత్రి, జ‌గ‌న్ మామ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌స్తుతం ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి కంటే మార్కాపురం నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. బాలినేని అంత‌టి వ్య‌క్తే సిట్టింగ్ సీటు సేఫ్ కాద‌ని అనుకుంటున్నారంటే మిగిలిన వాళ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ?  అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీలో ఎంపీలుగా ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎంపీ సీటు వ‌ద్ద‌ని, ఎమ్మెల్యే సీటే కావాల‌ని జ‌గ‌న్‌పై ప్రెజ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పాటు క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇద్ద‌రు ఎమ్మెల్యే సీట్ల కోసం జ‌గ‌న్‌పై ప్రెజ‌ర్ పెడుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిస్తే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ప్లాన్‌తో ఉన్న సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అద్దంకిలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ పార్టీ మార‌డంతో సుబ్బారెడ్డి క‌న్ను అద్దంకిపై ప‌డింది.

ఇక బుట్టా రేణుకు వైసీపీ త‌ర‌పున క‌ర్నూలు ఎంపీగా గెలిచి చేసిందేమి లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ట‌. ఎంపీగా పోటీ చేసేందుకు ఆమెకు ఏ మాత్రం ఇష్టంలేదు. దీంతో జ‌గ‌న్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీ సీటు కోసం బుట్టా రేణుక‌ను కాకుండా మ‌రో అభ్య‌ర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే రేణుక త‌న‌కు క‌ర్నూలు ఎమ్మెల్యే లేదా మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వాల‌ని అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ ఇద్ద‌రు ఎంపీల ఎమ్మెల్యే సీటు కోరిక‌ను జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు నెర‌వేరుస్తాడో ?  చూడాలి.