వైఎస్ ఫ్యామిలీ వీరాభిమాని సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మైందా..!

వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, వీరాభిమాని స‌బ్బం హ‌రి గురించి అనూహ్య‌మైన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు గూటికి చేరిపోతార‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నామ‌రూపాలు లేకుండా పోవ‌డంతో మౌనంగా ఉండిపోయారు హ‌రి. 2009లో అప్ప‌టి సీఎం వైఎస్ ప‌ట్టుబ‌ట్టి హ‌రికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. అందుకే ఆయ‌న వైఎస్ అన్నా ఆయ‌న ఫ్యామిలీ అన్నా ఎంతో అభిమానం కురిపిస్తారు. జ‌గ‌న్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్త‌లో జ‌గ‌న్‌కు తెర వెనుక మ‌ద్ద‌తిచ్చింది కూడా హ‌రే.

అంతేకాదు, సాక్షి మీడియాలో కొంత మేర‌కు పెట్టుబడులు కూడా ఉండేవి. అయితే, కేసుల నేప‌థ్యంలో ఆయ‌న వాటిని వెన‌క్కి తీసేసుకున్నార‌ని స‌మాచారం. ఇక‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్ వైఖ‌రిని ప్ర‌త్య‌క్షంగా వ్య‌తిరేకించిన వారిలో స‌బ్బం హ‌రి ఫ‌స్ట్ ఉన్నారు. తాను మంచిగానే చెబుతున్నాన‌ని, జ‌గ‌న్ వైఖ‌రిని మార్చుకోవాల‌ని అనేక సంద‌ర్భాల్లో హెచ్చ‌రించారు. నిజానికి ఆ స‌మ‌యంలో హ‌రి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే, జ‌గ‌న్ వైఖ‌రిని ఆయ‌న విమ‌ర్శించ‌డంతో ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. ఇక‌, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీచేయాల‌ని హ‌రి భావిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌ళ్లీ.. వైసీపీ గూటికి వెళ్తార‌ని పుకార్లు చెల‌రేగాయి. కాంగ్రెస్ ఎలాగూ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్తితి లేదుకాబ‌ట్టి ఉన్న ఆల్ట‌ర్నేట్ వైసీపీలోకే ఆయ‌న వెళ్తార‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న బీజేపీ, టీడీపీల్లో చేరే అవకాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది. గత కొంతకాలంగా సైలెంట్ గాఉన్న సబ్బం హరి నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి పెదవి విప్పారు. ఆయన చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.

చంద్రబాబు అనుభవం, రాజకీయ చతురత నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేసిందని ఆయన మీడియా ముందు చెప్పడం విశేషం. దీన్నిబట్టి చూస్తే సబ్బం హరి టీడీపీలోకి వెళతారన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఇటీవల కాలంలో కొందరు టీడీపీ నేతలు కూడా సబ్బం హరితో సమావేశమయినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సబ్బం హరి రాకను కోరుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.