కేసీఆర్ కొత్త సినిమా టైటిల్‌: అంతా నా ఇష్టం

తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! ఎవ‌రు విమ‌ర్శించినా.. ఎవ‌రు ఆయ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నా.. విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. తాను మాత్రం సైలెంట్‌గా ప‌ని తాను చేసుకు పోతున్నారు. నూత‌న సెక్ర‌టేరియ‌న్ నిర్మాణానికి వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కంటూ స‌రికొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించేసుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు త‌న `వాస్తు`కు అనుగుణంగా సెక్ర‌టేరియ‌ట్ ను నిర్మించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణ‌లో పెద్ద దుమారంగా మారింది. వాస్తు దోషం సాకుగా చెప్పి.. త‌న‌కోసం ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డంపై విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణ సీఎంగా పగ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత త‌న మార్కు చూపిస్తూనే వ‌స్తున్నారు సీఎం కేసీఆర్‌! త‌న నిర్ణ‌యాల‌తో అంద‌రినీ షాక్‌కు గురిచేస్తూనే ఉన్నారు. ఆయ‌న‌కు న‌మ్మ‌కాలు ఎక్కువ‌నే విష‌యం తెలిసిం దే! అందులోనూ వాస్తును మ‌రింత ఎక్కువ‌గా న‌మ్ముతారు. అందుకే సీఎంగా సంత‌కం చేసిన వెంట‌నే.. సెక్ర‌టేరియ ట్‌ను కూల్చేయాల‌ని, వేరే చోట నిర్మించాల‌ని ప్ర‌క‌టించారు. దీనిపై అంతా ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని కొంత‌కా లం మ‌రుగున‌పడేశారు. ఇదే స‌మ‌యంలో సీఎం నివాసం వాస్తులో తేడా ఉందన్న విషయాన్ని నమ్మిన ఆయన వందల కోట్ల ఖర్చుతో ఆగ‌మేఘాల మీద ప్రగతి భవన్ పేరుతో భారీ కట్టడాన్నే నిర్మించేశారు.

తాను నమ్మిన వాస్తుకు అనుగుణంగా లేదని తొలి నుంచి అసంతృప్తితో ఉన్నారు కేసీఆర్. అందుకే ఇప్పుడు ఆయన దృష్టి సికింద్రాబాద్ బైసన్ పోలో మైదానం మీద పడింది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బుకు కష్టోడియన్ గా ఉండాల్సిన సర్కారు.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ ముందుకు సాగుతోందని విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రుల క్వార్టర్లను పడగొట్టి సీఎం నివాసం.. క్యాంప్ ఆఫీస్ కట్టారు. దీనికి వైఎస్ వివరణ ఇస్తూ ఇది తన సొంత నివాసంకాదని.. ఏ సీఎం వచ్చినా ఇక్కడే ఉంటారని.. సీఎంకు అధికారిక నివాసం.. క్యాంప్ ఆఫీస్ అవసరం అని చెప్పారు.

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న‌ సచివాలయం బదులు.. బైసన్ పోలో గ్రౌండ్ లో మరో సచివాలయం ఎందుకు అంటే వాస్తు బాగాలేదనే విషయం సీఎం కేసీఆర్ చెప్పారు. త‌న‌కు వాస్తు బాగాలేకపోతే ఏకంగా సచివాలయాన్ని.. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన క్యాంప్ ఆఫీసులను మార్చేసి ఇష్టానుసారం కట్టేసుకుంటారా? అనేది ఇక్క‌డ ప్ర‌శ్న! ఓ ఐదేళ్ల తర్వాతో.. లేక పదేళ్ల తర్వాతో కొత్త ముఖ్యమంత్రి వస్తే ఆయన కూడా అవి వాస్తుకు అను గుణంగా లేవని భావిస్తే మరో క్యాంప్ ఆఫీసు.. సచివాలయం కట్టుకోవచ్చా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. సచివాల యానికి బైసన్ పోలో గ్రౌండ్ ఏ మాత్రం ఆమోదయోగ్యంకాదని.. అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనతో తనదైన ముద్ర వేయాలని కోరుకుంటారని.. కానీ సీఎం కెసీఆర్ మాత్రం ఇలాంటి భవనాలతో తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తుదోషం ఉందని తొలుత ప్రచారం చేసిన సీఎం.. తర్వాత ఫైర్ సేఫ్టీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పలు శాఖలకు..పాఠశాలలకు సొంత భవనాలే లేవని.. అలాంటి వాటన్నింటిని వదిలేసి.. హైదరాబాద్ లో సచివాలయాన్ని వదిలేసి.. వందల కోట్ల రూపాయలతో మరో సచివాలయం కట్టడానికి రెడీ అవటం సరికాదని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మ‌రి కేసీఆర్ ఈ నిర్ణయాన్న‌యినా వెనక్కి తీసుకుంటారో లేదో!!